
Rajamouli Oscar: గెలుపు రుచి చూస్తే ఓటమి అనేది దరిదాపుల్లో కూడా ఉండదు.. అలాగని ఆ గెలుపు ద్వారా గర్వం తలకెక్కితే చేసేది ఏమి ఉండదు. గత పది చిత్రాల ద్వారా గెలుపు గర్వాన్ని తలకు ఎక్కించుకోలేదు కాబట్టే రాజమౌళి ఈరోజు ఇండియన్ స్పీల్ బర్గ్ అయ్యాడు. ఓ శంకర్, రాజ్ కుమార్ హిరాణి కి దక్కని క్రెడిట్ సొంతం చేసుకున్నాడు.. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టబోయే ప్లాన్లో ఉన్నాడు.
95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో తాను తీసిన ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాటకు పురస్కారాన్ని దక్కించుకున్న రాజమౌళికి గ్లోబల్ సినిమా గెలుపు దారి దొరికింది. తను తీసిన బాహుబలి, బాహుబలి 2 ద్వారా తెలుగు సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ పరిచయం చేశాడు. సరైన ప్లానింగ్ ఉండాలే గానీ అన్ని మార్కెట్లను దున్నెయొచ్చు అని దర్శక, నిర్మాతలకు నిరూపించి చూపాడు. బాహుబలి తర్వాత దక్షిణాది సినిమాలు ఇండియన్ సినిమాను ఏ విధంగా షేక్ చేస్తున్నాయో చూస్తున్నాం. కేజిఎఫ్, కేజిఎఫ్ 2, పుష్ప, విక్రమ్, కాంతార వంటి సినిమాలు బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొడుతున్న తీరును కూడా చూస్తున్నాం.. ఇవన్నీ ఆ స్థాయికి వెళ్లాయి అంటే దానికి కారణం రాజమౌళి వేసిన దారి.. బాహుబలి ద్వారా కళ్ళు చెదిరే వసూళ్లు దక్కడంతో మిగతా నిర్మాతలు కూడా ధైర్యం చేస్తున్నారు. దర్శకులు కథలో నవ్యత చూపిస్తున్నారు..ఫలితంగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, అమెరికా, చైనా, జపాన్, రష్యా దేశాల్లోనూ మార్కెట్ ను విస్తృతం చేసుకుంటున్నారు.

నాటు నాటు పాట కోసం రాజమౌళి తనకున్న మార్కెటింగ్ టెక్నిక్ మొత్తం ఉపయోగించాడు. అమెరికాలోనే చాలా రోజులపాటు తిష్ట వేశాడు. తన కొడుకు కార్తికేయ ద్వారా రకరకాల మార్గాల్లో ప్రయత్నించాడు. వాస్తవానికి నాటు నాటు పాట ప్రైవేట్ ఎంట్రీ ద్వారా ఆస్కార్ లోకి ప్రవేశించింది. ఒక్కో మెట్టును అధిగమించుకుంటూ వెళ్లి ఆస్కార్ దాకా తీసుకెళ్లాడు అంటే రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్ ను అర్థం చేసుకోవచ్చు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడే చాలామంది ఆస్కార్ రాదని తేల్చేశారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజమౌళి నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చేలా చేశాడు.
ఇప్పుడు ఇక నాటు నాటు పాట వంతు అయిపోయింది. కానీ రాజమౌళి టార్గెట్ అది కాదు. ఆస్కార్ అవార్డు లిస్టులో ది బెస్ట్ డైరెక్టర్ పురస్కారం పొందడం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. గెలుపు రుచి దొరికిన నేపథ్యంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు పొందడం రాజమౌళికి పెద్ద కష్టమేమి కాదు. ఎవరిని కలిస్తే పనవుతుందో, ఈ రూపంలో వెళ్తే ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టొచ్చో రాజమౌళికి ఇప్పుడు అర్థం అయిపోయింది.. అందుకే తాను తీయబోయే మహేష్ సినిమాతో డాల్బీ థియేటర్లో ఉత్తమ దర్శకుడిగా జెండా ఎత్తేందుకు సిద్ధమవుతున్నాడు.
#RRRMovie composer M. M. Keeravani accepts the original song #Oscar for “Naatu Naatu” and graces the audience with a tune of his own. https://t.co/hxuR41IpLt pic.twitter.com/t4pbTwAE1M
— Los Angeles Times (@latimes) March 13, 2023