
Modi- Opposition: పార్లమెంటు ఎన్నికు సరిగ్గా ఏడాది మాత్రమే ఉంది. బీజేపీ కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ తిగజారుతోంది. ఈ తరుణంలో బలమైన బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్య కూటమి అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని భావిస్తున్న పార్టీలన్నీ కూటమికట్టే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌తో సాధ్యం కాదని భావిస్తున్న బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బీహార్‌లోని జేడీయూ, మహారాష్ట్రలోని ఎన్సీపీ, శివసేన, తమిళనాడులోని డీఎంకే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే విపక్ష కూటమి సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.
చాలా రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పక్షాలు..
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, బీఆర్ఎస్, డీఎంకే ఉన్నట్లే. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పక్షాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సరికి వైసీపీ, టీడీసీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒడిశాలోని నవీన్‌పట్నాయక్ కూడా బీజేపీ అనుకూలంగానే ఉన్నారు. యూపీలో మాయావతి, మహారాష్ట్రలో శివసేన చీలికవర్గం, తమిళనాడులో అన్నాడీఎంకే కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. కర్ణాకటలో జేడీఎస్ కూడా పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేస్తుంది. అధికారం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వదన్న వాదనను కొట్టిపారేయలేని పరిస్థితి. ఇలా చాలా రాష్ట్రల్లో బీజేపీ వ్యతిరేక కూటమితో పోటీపడే స్థాయిలో బీజేపీ అనుకూల పార్టీలు ఉన్నాయి.
విపక్షాల అనైక్యత..
ఇక మోదీని వ్యతిరేకించే విషయంలో విపక్షాల మధ్య ఐక్యత కుదరడం లేదు. రాహుల్‌గాంధీతోపాటు ఆప్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ, సమాజ్‌వాదీపార్టీ మధ్య ఇప్పటి వరకు ఐక్యత లేదు. కుదిరితే ప్రధానమంత్రి కావాలని అరవింద్కేజ్రీవాల్, మమతాబెనర్జీ, కేసీఆర్, శరద్‌పవార్, నితీశ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు విపక్షాల మధ్య అనైక్యత కూడా ఆటంకంగా మారుతోంది.

స్పష్టమైన కారణం చెప్పలేని పరిస్థితి..
ఇక బీజేపీని వ్యతిరేకించే విషయంలో విపక్షాలు స్పష్టమైన కారణాన్ని ప్రజలకు చెప్పేపరిస్థితి లేదు. కొన్నిసార్లు, రైతు వ్యతిరేకం అంటారు. కొన్నిసార్లు ప్రైవేటీకరణ అంటారు, ఇంకొన్నిసారు మతతత్వం అంటారు. మరికొన్నిసార్లు అవినీతి అని ఆరోపిస్తారు. ఇలా స్పష్టమైన ఎజెండా లేకుండా విపక్షాలు కలవడం వలన ప్రయోజనం ఉండదన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.