ప్రస్తుత కాలంలో ఉద్యోగులు, వ్యాపారులు నగరాలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి క్యాబ్స్ పై ఆధారపడుతున్నారు. దీంతో క్యాబ్ లకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రముఖ సంస్థ ఓలా మన దేశంతో పాటు ఇతర దేశాల్లో క్యాబ్ సర్వీసులను అందిస్తోంది. అయితే తాజాగా లండన్ లో ఓలా సంస్థకు భారీ షాక్ తగిలింది. ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఓలాకు సంబంధించిన ఆపరేటర్ లైసెన్స్ లను క్యాన్సిల్ చేసింది.

ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఓలా క్యాబ్స్ పై నిషేధం విధించడం గురించి మాట్లాడుతూ ఓలాపై నిషేధం విధించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని వెల్లడించింది. ఓలా క్యాబ్ లలో నిర్వహణా లోపాల వల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడుతున్నట్టు గుర్తించామని.. ఓలా క్యాబ్స్ లో చాలా పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయని.. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిషేధం విధిస్తున్నామని వెల్లడించింది.
లండన్ ప్రైవేట్ హైర్ వెహికల్ ఆపరేట్స్ లైసెన్స్ ఓలాకు ఇవ్వడం లేదని.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది. ఓలాకు లైసెన్స్ ఇస్తే స్థానిక ప్రజల రక్షణను ప్రమాదంలో నెట్టినట్టే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ నిర్ణయంతో అక్కడి ప్రజలు ఓలా సేవలను పొందలేరు. ఈ నిర్ణయం వల్ల ఓలా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఓలా మాత్రం సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్టు పేర్కొంది. త్వరలోనే ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ తో కలిసి పని చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ఓలా యూకే మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ రోజెన్ డాల్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రజలకు సురక్షితమైన సర్వీసులనే అందిస్తోందని.. ప్రజల భద్రతకు ప్రమాదం కలిగేలా తమ సంస్థ చేయదని అభిప్రాయపడ్డారు.