Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం.. అదానీ, సెహ్వాగ్ సంచలన నిర్ణయం

ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, దిగ్గజ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Written By: Dharma, Updated On : June 5, 2023 4:42 pm
Follow us on

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం.. గత మూడు దశాబ్దాలుగా అత్యంత ఘోరమైన ఘటన ఇది. దాదాపు 277 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యి మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా. దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైన సమయమిది. ఎంతో మంది తమ వారిని కోల్పోయారు. ప్రమాదంలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. తమ వారిని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, దిగ్గజ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని గౌతమ్ అదానీ ప్రకటించారు. వారి చదువుకు అయ్యే ఖర్చునంతా తామే భరిస్తామన్నారు. ఉచితంగా విద్యను అందించి వారికి మంచి భవిష్యత్ కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.’ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్రంగా కలత చెందాం. ఈ ఘోర దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలకు, పిల్లలకు మంచి భవిష్యత్ అందించండి’ అంటూ గౌతమ్ అదానీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

దిగ్గజ క్రికేటర్, అభిమాన క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం స్పందించారు. బాధిత చిన్నారుల బాధ్యతను తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ విషాద ఘటనతో అనాథలుగా మిగిలిన పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తా. వారికి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్య అందిస్తా” అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి, స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చిన వారికి, వైద్య బృందాలకు సెల్యూట్‌ చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరు సెలబ్రిటీలు అభినందనలు అందుకుంటున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని కోరుతున్నారు.