https://oktelugu.com/

Tirupati : తిరుపతిలో అద్భుతం.. గజరాజులే ప్రజల ప్రాణాలు రక్షించాయి

గజరాజుల వల్లే తాము ప్రాణాలతో బయటపడగలిగామని చెబుతూ ఆ దృశ్యాలను పెడుతుండడంతో అవి వైరల్ అవుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : June 5, 2023 5:12 pm
    Follow us on

    Tirupati : తిరుపతిలోని గోవిందరాజ ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఇది పెను ప్రమాదమని.. పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోయేవని.. కానీ గజరాజు కాపాడిందని భక్తులు చెబుతున్నారు. లేకుండా ఊహకందని ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణలోనే గోవిందరాజుల ఆలయం ఉంది. ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు తిరుప‌తికి వ‌స్తుంటారు. తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకునే ముందు గోవింద‌రాజుల వారి ద‌ర్శ‌నం చేసుకోవడం ఆనవాయితీ.

    ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వంద‌ల ఏళ్ల‌నాటి వృక్షాలు అనేకం ఉన్నాయి. వీటిని టీటీడీ దేవ‌స్థానం ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షిస్తోంది. పెద్ద పెద్ద గాలివాన‌ల‌ను త‌ట్టుకునే విధంగా చెట్ల‌ను సంర‌క్షిస్తుంటారు. చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గిస్తూ పాదుల‌ను ప‌టిష్టం చేస్తుంటారు. గోవింద‌రాజుల ఆల‌యంలో వంద‌ల సంవ‌త్స‌రాల నాటి ఓ రావిచెట్టు ఉంది. గురువారం బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో భక్తులు పరుగులుతీసి రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. చెట్టు కింద సేద దీరారు.

    ఆ సమయంలో వాహన సేవకు గాను లక్ష్మీ, వైష్ణవి అనే గజరాజులను తీసుకొచ్చారు. ఇంతలో గాలి వాన బీభత్సం ప్రారంభమైంది. ఒక్కసారిగా వైష్ణవి అనే గజరాజు ఘీంకరించింది. ఈ హఠాత్ పరిణామంతో భక్తులు చెట్టు వద్ద నుంచి పరుగులు తీశారు. అక్కడికి కొద్దిసేపటికే రావిచెట్టు కూలిపోయింది. క‌డ‌ప జిల్లాకు చెందిన డాక్ట‌ర్ గుర్ర‌ప్ప‌పై ప‌డ‌టంతో ఆయ‌న అక్క‌డిక్క‌డే మృతి చెందారు. ఆ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.వ‌ట‌వృక్షాన్ని ప్ర‌త్యేక ప‌ద్ద‌తుల్లో తొల‌గించారు. అనంత‌రం, ఆల‌యాన్ని శుద్దిచేసి, సంప్రోక్ష‌ణ చేశారు.

    భగవత్ సంకల్పంతోనే తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని.. గజరాజుల రూపంలో కలియుగ వెంకటేశ్వరుడే విపత్తు నుంచి తప్పించాడని భక్తులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి పలువురు భక్తులు గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గజరాజుల వల్లే తాము ప్రాణాలతో బయటపడగలిగామని చెబుతూ ఆ దృశ్యాలను పెడుతుండడంతో అవి వైరల్ అవుతున్నాయి.

    YouTube video player