Odisha Husband And Wife: భార్యను సహ ధర్మచారిణి అంటారు.అంటే తన జీవితంలో సగమని భావించాలంటారు. తనను నమ్ముకొని వచ్చిన ఆలిని అన్నివేళలా అండగా నిలవాలంటారు. కానీ కొందరు మాత్రం కర్కశంగా వ్యవహరిస్తారు. అమానుషంగా ప్రవర్తిస్తారు. అనుమానంతో కడతెరుస్తుంటారు. పరస్త్రీ వ్యామోహంలో పడి భార్య పట్ల నిర్లక్ష్యం చూపుతారు. మరకొందరైతే వ్యసనాలకు బానిసగా మారి కట్టుకున్న భార్యనే నరకం చూపిస్తారు. అయితే ఒడిశాలో ఇటువంటి అమానవీయ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యసనాలకు బానిసైన వ్యక్తికి బయట ఎక్కడా అప్పుపుట్టలేదు. దీంతో సరికొత్తగా ఆలోచించిన వ్యక్తి భార్యను అడ్డం పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుతో వేరే రాష్ట్రానికి చెక్కేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అయితే ఎనిమిదేళ్ల తరువాత కానీ భర్త తనకు చేసిన అన్యాయాన్ని బాధిత మహిళ గుర్తించలేకపోయింది.

వైద్యం చేయిస్తానని చెప్పి…
ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా కొటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ, రంజిత దంపతులు నివసిస్తుండే వారు. వీరికి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రశాంత్ కందూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుడు. రంజితను ఇష్టపడి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2018లో రంజిత అస్వస్థతకు గురైంది. కిడ్నీలో రాళ్లు ఉంటాయని చెప్పి ప్రశాంత్ రంజీతాను భువనేశ్వర్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించాడు. దీంతో తన భర్త తనపై చూపిస్తున్న కేర్ ను చూసి రంజిత మురిసిపోయింది. కానీ భర్త తనకు తెలియకుండా తన కిడ్నీని తీసి డాక్టరు సహాయంతో విక్రయించడాని తెలుసుకోలేకపోయింది. ఆ సమయంలో అనస్తీషియా రూపంలో ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి తతంగాన్ని జరిపించడంతో ఆమె గుర్తించలేకపోయింది. అయితే ఇటీవల ఆమె కడుపునొప్పితో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరింది. డాక్టరు పరీక్ష చేసి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఒక కిడ్నీతో ఉన్నారని చెప్పడంతో రంజితాకు మైండ్ బ్లాక్ అయ్యింది. అటు భర్త ప్రవర్తనలో అనుమానం రావడంతో ఆరా తీయడం ప్రారంభించింది., భర్తే కిడ్నీ విక్రయించాడని తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.

పోలీసులకు ఫిర్యాదు..
అయితే భర్త ప్రస్తుతం తన వద్ద లేడు. ఎనిమిది నెలల కిందట మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె తో కలిసి బెంగళూరులో కాపురం పెట్టాడు. అటు శరీరంలో అవయం పోయి..ఇటు భర్త జాడ లేకపోడంతో రంజిత జీవితం కకావికలమైంది. వృద్ధులైన తల్లిదండ్రులే ఆసరా అయ్యారు. తన జీవితం నాశనం చేసిన భర్త ప్రశాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రంజిత డిమాండ్ చేస్తోంది. మల్కాన్ గిరి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రశాంత్ కోసం బెంగళూరుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని పంపించారు.