Number plate Rs 70 Crore : అవి పైసలా.. ? పెంకాసులా? ఒక కారు నంబర్ ప్లేట్ కోసం అంత ధరనా? అని ఇప్పుడు అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు. కార్లే కోటి రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఏకంగా ఆ కార్ కు నంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తం వెచ్చించిన ఆసామీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది.

మన దేశంలో కారుకు నంబర్ ప్లేట్ కోసం ఫ్యాన్సీ నంబర్లు అయితే 20 లక్షల వరకూ పాడి సొంతం చేసుకుంటారు. పోటీ పెరిగితే రూ.50 లక్షల వరకూ వెళ్లొచ్చు. ఇప్పటివరకూ మన భారత్ లో ఒక కారు నంబర్ ప్లేట్ కోసం కేరళకు చెందిన ఒక యజమాని రూ.31 లక్షలు వెచ్చించాడు. అదే దేశంలో ఇప్పటివరకూ ఉన్న ఒక రికార్డు.
కానీ సంపన్నులు ఉండే దుబాయ్ లో అలా కాదు.. అక్కడ ఓ బడాబాబు తన కారుకు నంబర్ ప్లేటు కోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చుచేశాడు. వామ్మో అని నోరెళ్లబెట్టకండీ.. ఇది నిజంగా నిజం.
దుబాయ్ లో తాజాగా నంబర్ ప్లేట్ల వేలం జరిగింది. కార్లకు ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లను జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్ కోసం వేలం వేశారు. ఇందులో AA8 నంబర్ ఈ వేలంలో అత్యధిక ధర పలకడం విశేషం. ఏకంగా దుబాయ్ కరెన్సీలో 35 మిలియన్ దీరమ్ లు.. అంటే మన కరెన్సీలో రూ.70 కోట్లు వెచ్చించి మరీ ఈ నంబర్ ను ఓ బడాబాబు కొనుగోలు చేశాడు.
ఇది ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన మూడో నంబర్ ప్లేటుగా రికార్డులు సృష్టించింది. గత ఏడాది AA9 నంబర్ ప్లేట్ ను వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ.79 కోట్లు పలికింది. ఇదే ప్రపంచంలో అత్యధిక ధర పలికిన నంబర్ ప్లేటుగా మొదటిస్థానంలో నిలిచింది.
‘వన్ బిలియన్ మీల్స్ సంస్థ’ కోసం ఈ వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందించేందుకు వినియోగిస్తారు. అందుకే ఈ వేలాన్ని మానవత్వపు కోణంలోనూ కుబేరులు భారీగా ధర వెచ్చించి కొంటారు. వాటితో పేదల కడుపులు నింపవచ్చని ఇలా ఉదారంగా వేలంలో కోట్లు ఖర్చు చేస్తారు. దుబాయ్ లోని ఆర్టీఏ ఈ వేలాన్ని నిర్వహించింది. తాజాగా వేలంలో ఈ నంబర్ తోపాటు F55 నంబర్ కు 8.232 కోట్లు, V66నంబర్ కు 7.91 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు.
Recommended Videos