
Balagam Impact: ఒక సినిమా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వైరాన్ని తొలగించి కలిసిపోయేలా చేసింది. ఆ సినిమా ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆత్మీయతను మరోసారి గుర్తు చేసింది. స్థల వివాదంతో కొన్నాళ్ల కిందట దూరమైన ఆ ఇద్దరు అన్నదమ్ములు.. బలగం సినిమాతో ఒక్కటై.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎక్కడ జరిగింది..? ఎవరా ఇద్దరు అన్నదమ్ములు. మరి ఆలస్యం ఎందుకు చదివేయండి.
ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దర్శకుడుగా తొలి సినిమాతోనే వేణు తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. కాంచన లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కురిపిస్తున్న కాసులు వర్షం చూసి అగ్ర దర్శకులు కూడా షాక్ అవుతున్నారు. అటువంటి సినిమా ఓ ఇద్దర అన్నదమ్ముల కలయిక కారణం కావడం గమనార్హం. చిన్న స్థలం వివాదంలో కొన్నాళ్లుగా వైరంతో ఉన్న ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ సినిమా చూసిన తర్వాత కలిసిపోవడం.. ఈ సినిమాలో పండించిన సెంటిమెంట్ కు నిదర్శనంగా చెప్పవచ్చు.
మానవ సంబంధాలను పరిమళించిన సినిమా..
బలగం సినిమా భిన్నంగా చిత్రీకరించారు. తెలంగాణా సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ సంబంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు వేణు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు తమ జీవితంలోని మధురానుభూతులను నెమరు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యాన్ని మరోసారి తట్టి చూపించేలా ఈ చిత్రం ఉంది అంటున్నారు. కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా తీసిన ఈ సినిమా.. గత జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునేలా చేస్తోంది అంటున్నారు వీక్షకులు.

సినిమా చూసిన తర్వాత ఒక్కటైన అన్నదమ్ములు..
తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలోని లక్ష్మణ చాంద గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గుర్రం పోసులు, గుర్రం రవి. వీరిద్దరూ స్థలం వివాదం కారణంగా కొన్నేళ్లుగా గొడవ పడుతున్నారు. పెద్దలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీరిద్దరూ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల మాటను పట్టించుకోలేదు. ఎవరి మాట వినకుండా వీరి కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి శనివారం గ్రామంలో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాలు చూసిన ఆ ఇద్దరి అన్నదమ్ములు మనసు మార్చుకుని ఆదివారం స్థల వివాదాన్ని పరిష్కరించుకున్నారు. పెద్దల సమక్షంలో ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సినిమాలోని కుటుంబ కథ అంశాలు తమను మార్చాయని ఈ సందర్భంగా ఇద్దరు అన్నదమ్ములు పేర్కొన్నారు. ఆస్తిపాస్తులు కోసం గొడవ పడడం అసహ్యంగా అనిపించిందని వాళ్లు పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.