
CM Jagan : రాష్ట్రంలో కొద్దిరోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఎమ్మేల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ పని అయిపోయింది అంటూ పెద్ద ఎత్తున టిడిపి ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు అనేక మంది వైసీపీ నాయకులు దీనిపై మాట్లాడారు గానీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై సీఎం పోస్టుమార్టం నిర్వహించారు. ఓటమిగా గురించి సుదీర్ఘంగా సీఎం సమావేశంలో చర్చించిన అంశాలు లీక్ అయ్యాయి.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, వైసీపీ ఓటమిపై స్పందించారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో జరుగుతున్న పార్టీ సమీక్ష సమావేశంలో ఈ మేరకు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూనే.. ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అది గొప్ప విజయమా.. మన ఓటర్లు లేరు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెబుతున్నారంటూ విపక్షాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే అందులో 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి అని పేర్కొన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 2.5 లక్షల మంది ఉంటారని.. అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి దాదాపు 80 లక్షల ఓట్లు పరిధి జగన్ తెలిపారు. ఆ పరిధిలో 87 శాతం అంటే అక్క, చెల్లెమ్మలు కుటుంబాలు, మన ప్రభుత్వం అందించే లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయన్నారు. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేసామో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా తక్కువ మంది ఓటర్లుగా పేర్కొన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే డిబిటిలో ఉన్నారని జగన్ తెలిపారు. కాబట్టి ఇది ఏ రకంగా రెప్రజెంటేషన్ శాంపిల్ అవుతుందని ప్రశ్నించారు.
రెండో ప్రాధాన్యత ఓటుతోనే విజయం..
గొప్ప విజయం అని చెబుతున్న ఏ ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవలేదు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతతో గెలిచింది అన్నారు. ఎంత మంది ఏకం కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు వారికి వచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఇలా వాపును చూపించి అది బలం అని చూపిస్తున్నారని విపక్షాలపై జగన్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న అతి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు.
నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా..
రాజకీయాల్లో నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం అంశం ఏమిటంటే.. ‘రాజకీయం అంటే మానవ సంబంధాలు’ అనే విషయాన్ని నేర్చుకున్నారు వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. మీతో పని చేయించి మిమ్మల్ని గెలిపించాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు. ఈ అడుగులన్నీ కూడా దాని కోసమే అని స్పష్టం చేశారు. కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గా లేకపోతే పార్టీకి, క్యాడర్ కు నష్టమన్నారు. మనం అధికారంలోకి రాకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వెల్లడించారు. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గడపగడపకు కార్యక్రమం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం జరిగితే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుందని స్పష్టం చేశారు.