Cyber Fraud : ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నిరక్షరాస్యులే కాదు.. ఉన్నత విద్యావంతులు సైతం వీరి బారిన పడి మోసాలకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మట్టాడుతున్నామని, ఆధార్ నంబర్ చెప్పండి, మీ ఏటీఎం పని చేయడం లేదని, కారు గెల్చుకున్నారని, మనీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో క్రెడిట్ కార్డులిమిట్ పెంచుతామని ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారు. తాజాగా ఓ వైద్యురాలు అక్షరాల రూ.13 లక్షలు పోగొట్టుకుంది.
ఇటీవల నేరుగా వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం కష్టతరంగా మారింది. అందుకే ఎక్కువ మంది వివాహ పరిచయ వేదికలకు, ప్రైవేటు మ్యాట్రీమోనీలను ఆశ్రయిస్తున్నారు. చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళా వైద్యురాలు పెళ్లి కోసం మ్యాట్రీ మోనీని ఆశ్రయించింది. తన వివరాలను సైట్ లో నమోదు చేసుకుంది. అయితే ఇదే మ్యాట్రిమోనీ సైట్ లో కొంత మంది నైజిరియన్లు నకిలీ ఫొటో, వివరాలతో నమోదు చేసుకున్నారు. సదరు వైద్యురాలని గుర్తించిన నైజిరియన్ వికాస్ కుమార్ అనే పేరుతో వాట్సప్ చేశాడు. తన కూడా డాక్టర్ అని విదేశాల్లో పని చేస్తున్నానని.. త్వరలో ఇండియాకు వచ్చి ఆస్పత్రి పెట్టనున్నట్టు నమ్మించాడు.
అయితే ఈ క్రమంలో మహిళా వైద్యురాలితో వికాస్ కుమార్ పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్ చేసేవాడు. వాట్సాప్ సందేశాలు పంపించేవాడు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉంటున్నానని నమ్మబలికాడు. వన్ మార్నింగ్ పెళ్లి ప్రపోజుల్ పెట్టాడు. రకరకాల రంగుల జీవితంతో పాటు సేమ్ ప్రొఫెషన్ కావడంతో మహిళా వైద్యురాలు సైతం ఒప్పుకుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా వికాస్ బహుమతి కూడా పంపినట్టు బాధితురాలికి చెప్పాడు. అక్కడ నుంచే ఆయన కష్టాలు ప్రారంభమయ్యాయి.
తొలుత మీకు స్కాంట్లాండు నుంచి ఒక బహుమతి వచ్చిందని .. అది చేరాలంటే రూ.35 వేలు కట్టాలని ఫోన్ వచ్చింది. దీంతో ఆమె సదరు వ్యక్తి ఖాతాలో రూ.35 వేలు జమ చేసింది. వైద్యురాలికి మరుసటి రోజు మరో ఫోన్ వచ్చింది. మీ స్కాట్లాండ్ నుంచి మీ పార్శిల్‌లో విదేశీ కరెన్సీ ఉందని, దాని కోసం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆమె మరో రూ.50 వేలు పంపింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.13 లక్షలు వసూలు చేశారు.
తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళా వైద్యరాలు వికాస్ కుమార్ తో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. అక్కడకు కొద్దిరోజుల తరువాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తాను సైబర్ నేరస్థుడి ట్రాప్ లో పడినట్టు నిర్థారించి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీలో ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 మోసాలకు పాల్పడినట్టు వెల్లడించారు. సైబర్ నేరస్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.