Nalgonda District : తల్లి లేదు.. తండ్రి రాడు.. బట్టల కొట్టులో ఈ చదువుల తల్లి ఆదర్శం

కానీ ఆమె నిర్ధేశించుకున్న లక్ష్యానికి ఆ మొత్తం చాలడం లేదు. అందుకే దయార్థ హృదయుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సాయం చేయదలచుకున్న వారు 8688186590 నంబరుకు సంప్రదించాలని కోరుతోంది.

Written By: Dharma, Updated On : June 19, 2023 6:46 pm
Follow us on

Nalgonda District : ఆమెకు చదవాలన్న కోరిక బలీయంగా ఉంది. కానీ వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రి లేడు. వెన్నంటి నడిచే తల్లి లేదు. తోబుట్టువులు లేరు. అయితేనేం ఆ చిన్నారి శక్తికి మించి చదువుకుంది. అగ్రశేణిలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇప్పుడు ఆర్థిక సహకారం లేక బట్టల దుకాణంలో పనిచేస్తోంది. మీకు అన్నీ ఇస్తాం చదువుకోండి అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నా.. ముందడుగు వేయలేని విద్యార్థులు అనేకం. కానీ నేను చదువుకుంటాను కాస్తా సాయం చేయండి అని ఆ చిన్నారి అడుగుతున్న తీరు హృదయ విదారకం.

నల్లొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మలకు అలేఖ్య అనే ఒక్కాగానొక్క కుమార్తె ఉంది. లక్ష్మమ్మ అనారోగ్యానికి గురికావడంతో  అలేఖ్య చిన్ననాడే తల్లీకూతుళ్లను విడిచిపెట్టి వెంకటయ్య తన దారిన తాను చూసుకున్నాడు. దీంతో లక్ష్మమ్మ తన కుమార్తెను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి అనారోగ్యంతో పోరాడుతూ కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది. అటు తల్లి పరిస్థితిని చూసిన అలేఖ్య కష్టపడి చదువుకుంటూ పదో తరగతి పూర్తి చేసింది.

నిడమనూరు వసతిగృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతుండగా తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ లక్ష్మమ్మ మృతిచెందింది. అయినా మొక్కవోని దీక్షతో, విషాదాన్ని దిగమింగుకొని అలేఖ్య ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పదో తరగతి పరీక్షలను రాసింది. 9.7 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఉన్నత చదువులకు ఆర్థిక స్థోమత లేక హైదరాబాద్ లోని ఓ బట్టల దుకాణంలో అలేఖ్య పనిచేస్తోంది.

తన చదువుకు సాయం చేయాలని అలేఖ్య కోరుతోంది. తనలాంటి పేద విద్యార్థికి సాయం చేయాలని విన్నవిస్తోంది. ఉన్నత లక్ష్యంతో ముందుకెళుతున్న తనకు ఆర్థిక సమస్యలే అడ్డంకి అని చెబుతోంది. ఆ చిన్నారి పరిస్థితి గమనించిన స్థానికులు కొంత మొత్తం సాయం చేశారు. కానీ ఆమె నిర్ధేశించుకున్న లక్ష్యానికి ఆ మొత్తం చాలడం లేదు. అందుకే దయార్థ హృదయుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సాయం చేయదలచుకున్న వారు 8688186590 నంబరుకు సంప్రదించాలని కోరుతోంది.