
Natu Natu Song Oscar: భారతీయ సినీ ప్రేమికులకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు…’ సాంగ్ అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్ దక్కించుకుంది.
పాట రికార్డింగ్‌కే 19 రోజులు..
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. అంతేకాదు, గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై.. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా ‘నాటు నాటు…’ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే దీని వెనుక ఆర్‌ఆర్‌ఆర్ టీం శ్రమను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవల్సిందే. ఈ పాటను రికార్డింగ్ చేయడానికే టీం 19 రోజుల సమయం తీసుకుంది. సాధారణంగా పాట రికార్డింగ్ కోసం మహా ఐతే ఐదు రోజులు పడుతుంది. కానీ నాటు.. నాటు.. పాట రికార్డింగ్ కోసం 19 రోజులు పట్టింది. అంటే టీం వర్క్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వరమణి కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
షూటింగ్‌కు రెండు వారాలు..
ఇక ఈ పాట షూటింగ్ వెనుక భారీ శ్రమ ఉంది. ఈ పాటను ఉక్రెయిన్‌టో చిత్రీకరించారు. పాటలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టౌగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట షూటింగ్ కోసం రెండు వారాలు(15 రోజులు) తీసుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, చిన్న తప్పు కూడా దొర్లకుండా పాటను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి.

ప్రేమ్‌రక్షిత్ కష్టం..
ఆస్కార్ అందుకున్న ‘నాటు నాటు’ పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పడిన కష్టం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. పాట కోసం రూపొందించిన స్టెప్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 20 రోజులు పట్టింది. ఈ పాట కోసం మేం ఉదయం 6 గంటలకు మేల్కొని, రాత్రి 10 గంటలకు పడుకునే వాళ్ల అని కొరియోగ్రాఫర్ తెలిపారు. వారి కోసం ఏకంగా 118 స్టెప్స్ కొరియోగ్రఫీ చేశాను అని చెప్పారు.