Naresh- Pavitri Lokesh: సోషల్ మీడియా ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. మౌనంగా భరించే కొద్దీ ఎక్కువ చేస్తున్నారని చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల అనసూయ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించింది. తనతో పాటు పలువురు యాంకర్స్, నటులపై అసభ్యకర పోస్ట్స్, కామెంట్స్ చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న వ్యక్తిపై అనసూయ ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్ కి పంపారు.

పవిత్ర లోకేష్-నరేష్ సైతం సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ మీద కంప్లైంట్ చేశారు. నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ తమ వ్యక్తిత్వం దెబ్బతీస్తున్నారు. గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ పరువు నష్టం దావా వేయడం జరిగింది. నరేష్-పవిత్ర లోకేష్ కంప్లైంట్ ఆధారంగా నాంపల్లి కోర్ట్ విచారణకు ఆదేశించింది. పవిత్ర లోకేష్ తన కంప్లైంట్ లో పొందుపరిచిన యూట్యూబ్ ఛానల్స్ పై విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఈ మేరకు రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్‌పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు కోర్టు నోటీసులు వెళ్లాయి. విచారణకు హాజరు కావాలని, సహకరించకపోతే చర్యలు ఉంటాయని కోర్ట్ వెల్లడించింది. ఈ క్రమంలో పైన పేర్కొన్న యూట్యూబ్ ఛానల్స్ సమస్యల్లో చిక్కుకున్నారు. నేరం రుజువైతే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు ప్రచురించిన కథనాలకు సహేతుకమైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

తప్పుడు రాతలకు పాల్పడినట్లు తేలితే ఛానల్స్ రద్దు కావచ్చు. అలాగే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే ఆస్కారం ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఉన్నారు. కంప్లైంట్ లో రమ్య రఘుపతి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రచారం వెనకున్న మాస్టర్ మైండ్… రమ్య రఘుపతినే అని నరేష్-పవిత్ర లోకేష్ ప్రధాన ఆరోపణ. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఉద్దేశపూర్వకంగా రమ్య రఘుపతి తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని పవిత్ర లోకేష్ ఆరోపిస్తున్నారు. కాగా నరేష్ కొన్నాళ్లుగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వని తరుణంలో ఆమె వారి బంధాన్ని వ్యతిరేకిస్తున్నారు.