India- China Border Dispute: కోవిడ్ ఇబ్బంది పెడుతోంది.. దేశం మొత్తం లాక్ డౌన్ అమలవుతోంది.. వందల కొద్ది ప్రాణాలు పోతున్నాయి.. ఇలాంటి స్థితిలో ఏ దేశమైనా ఏం ఆలోచిస్తుంది.. ప్రజలను ఎలా కాపాడుకోవాలి అని… వారికి వైద్య సదుపాయాలు ఎలా కల్పించాలా అని.. కానీ చైనాలో అలా కాదు.. దానిది పరాన్న జీవి టైపు క్యారెక్టర్. మంది మీద పడి తినటమే.. గతంలో గాల్వన్ లోయ, లడ్డాఖ్ ఉద్రిక్తల తర్వాత చైనా ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ ఇప్పుడు మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది.

తవాంగ్ సెక్టార్లో..
అరుణాచల్ ప్రదేశ్ తెలుసు కదా.. చైనాకు సరిహద్దులో ఉంటుంది.. ఈ రాష్ట్రంలో తవాంగ్ సెక్టర్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు.. తవాంగ్ సెక్టార్ లోని యాంగ్ త్సే ప్రాంతం వద్ద ఈ నెల 9వ తేదీన ఈ ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో పోలిస్తే చైనా దేశానికి సంబంధించిన సైనికులు ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది. “డిసెంబర్ 9న చైనా సైనికులు తవాంగ్ సెక్టార్లో ఎల్ ఏ సి వెంబడి సున్నితమైన ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఘర్షణ తలెత్తింది.. రెండువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు” అంటూ భారత సైన్యం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘర్షణ అనంతరం ఇరుదేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళాయి. అనంతరం అక్కడి భారత కమాండర్ చైనా తరపు కమాండర్తో సమావేశమై చర్చలు జరిపారు.. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులను తిరిగి నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టారు.. అయితే ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ ఎంత మంది సైనికులు ఉన్నారు? ఎంతమంది గాయపడ్డారు వంటి వివరాలు బయటకు వెల్లడి కాలేదు.
భిన్నాభిప్రాయాలు
ఈ సెక్టార్ ఎవరికీ చెందుతుంది అనే దానిపై భారత్, చైనా మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరు దేశాల బలగాలు తమ సరిహద్దుగా వేర్వేరు రేఖలను చూపించుకుంటూ అక్కడి వరకు గస్తీ తిరుగుతుంటాయి. 2006 నుంచి ఇదే కొనసాగుతోంది. యాంగ్ త్సె సమీపంలో ఇరుదేశాల బలగాల మధ్య గత ఏడాది అక్టోబర్లో ప్రతిష్టంబన తలెత్తింది. స్థానిక కమాండర్ల చర్చల అనంతరం నాడు పరిస్థితులు సద్దుమణిగాయి. 2020 జూన్ లో భారత్, చైనా బలగాలు తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాయి. నాటి ఘటనలో క ల్నల్ సంతోష్ బాబు తో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అదే ఏడాది ఆగస్టులో తూర్పు లడాఖ్ లోని రించెన్ లా ప్రాంతంలో ఇరుదేశాల బలగాలు మరోసారి పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ వాటి మధ్య ఘర్షణ జరగలేదు.

ఆరుగురు సైనికులకు గాయాలు
తవాంగ్ సెక్టార్ లో చెలరేగిన ఘర్షణలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారందరినీ గుహవాటి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 200 మంది చైనా సైనికులు కర్రలు, ఇనుప ముళ్ళతో కూడిన రాడ్లు పట్టుకొని యాంగ్ త్సె వద్దకు వచ్చారు. వారికి భారత బలగాలు అత్యంత ధీటుగా బదులిచ్చాయి. ఇరుదేశాల సైనికులకు స్వల్ప గాయాలు అయ్యాయని చెబుతున్నప్పటికీ… కొందరికి కాళ్లు, చేతులు విరిగాయని వార్తలు వస్తున్నాయి.
నేడు వాయిదా తీర్మానం
అయితే ఈ ఘటన నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ప్రభుత్వం పార్లమెంటుకు ఎందుకు తెలియజేయడం లేదని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై మంగళవారం వాయిదా తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు.. మరోవైపు ఈ పరిణామాలను పొక్కకుండా ఉండేందుకు ప్రధాన నరేంద్ర మోడీ తొక్కి పెడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రమేష్ వ్యాఖ్యానించారు.