Nara Lokesh Padayatra: తెలుగునాట పాదయాత్రలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దాదాపు పార్టీల పనైపోయిందనుకుంటున్న తరుణంలో నేతల పాదయాత్రలతో ఆ పార్టీలు గట్టెక్కాయి. అధికారంలోకి రాగలిగాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసి కనివినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత టీడీపీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. అప్పటి నుంచే లోకేష్ తో పాదయాత్ర చేయిస్తారని టాక్ నడిచింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో లోకేష్ పాదయాత్రకు హైకమాండ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లోకేష్ పాదయాత్రను యువగళం అన్న పేరును ఖరారు చేసింది.

400 రోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 100 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 4000 కిలోమీటర్ల మేర లోకేష్ నడవనున్నారు. జనవరి 27న ప్రారంభంకానున్న పాదయాత్రకు టీడీపీ హైకమాండ్ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటివరకూ కొనసాగేలా ప్లాన్ చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే అందుకు తగ్గట్టు అప్పటికప్పుడు షెడ్యూల్ ను మార్చనున్నారు.ఇప్పటికే చంద్రబాబు అన్ని జిల్లాల్లో రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా లోకేష్ పాదయాత్రపై అక్కడి నేతలకు చంద్రబాబు దిశ నిర్దేశం చేస్తున్నారు.
యువగళం పేరిట నిర్వహిస్తున్న లోకేష్ పాదయాత్ర అటు పార్టీకి పూర్వ వైభవం తెస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ కు నిరాశే ఎదురైంది. మంగళగిరి నుంచి బరిలో దిగిన ఆయన ఓటమి చవిచూశారు. దీంతో ఓ రకమైన అపవాదు లోకేష్ పై పడింది. ఆయన నాయకత్వంపై ఓకింత అనుమానాలున్నాయి. పాదయాత్ర వాటన్నింటినీ పటాపంచలు చేస్తుందని టీడీపీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అందుకే పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

లోకేష్ పాదయాత్ర వివరాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని సీనియర్ నాయకులు ప్రకటించారు. యువగళం పోస్టర్లను ఆవిష్కరించారు. జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుందని..అందుకు సంబంధించి రూట్ మ్యాప్ ను, షెడ్యూల్ ను సైతం ప్రకటించారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండగా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. లోకేష్ దారిపొడవునా యువత, విద్యార్థులు, మహిళలతో మమేకమయ్యేలా.. వారితో సమావేశాలు కొనసాగేలా ప్లాన్ రూపొందించారు. రైతు సమస్యలు, అధికారంలోకి వస్తే తీసుకోబోయే పథకాలు, నిర్ణయాలు లోకేష్ ప్రకటించే అవకాశముంది. ఎక్కడికక్కడే స్థానిక అంశాలను ప్రస్తావించేలా ఒక ప్రత్యేక ప్రణాళిక సైతం తయారుచేశారు. పాదయాత్ర సమన్వయ బాధ్యతలను సీనియర్ నేతలు చూడనున్నారు. యాత్ర ద్వారా టీడీపీ విజయతీరాల వైపు చేరుతుందని పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.