
Naga Chaitanya – Nagarjuna : తల్లిదండ్రుల ప్రేమకు కొలమానం ఉండదు. పిల్లలు పుట్టాక వాళ్లే ప్రపంచంగా పేరెంట్స్ బ్రతుకుతారు. వాళ్ళ ఎడబాటును తట్టుకోలేరు. ఆ పరిస్థితి వస్తే జీర్ణించుకోవడం చాలా కష్టం. నాగ చైతన్య విషయంలో నాగార్జున ఇదే తరహా వేదన అనుభవించారట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పారు. సినిమాల్లోకి రాకముందే నాగార్జున వివాహం చేసుకున్నారు. విదేశాల్లో పెద్ద చదువులు చదివిన నాగార్జునకు కూతురు లక్ష్మీని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్మాత రామానాయుడు భావించారు. ఒకే సామాజికవర్గం. అక్కినేని నాగేశ్వరరావుతో మంచి సాన్నిహిత్యం. ఈ క్రమంలో అనుకున్నంతనే సంబంధం కుదిరింది.
ఏఎన్నార్, రామానాయుడు సమక్షంలో 1984లో లక్ష్మి-నాగార్జున పెళ్లిపీటలు ఎక్కారు. కారణం తెలియదు కానీ… ఇద్దరికీ కుదరలేదు. మనస్పర్థలు ఏర్పడ్డాయి. 1990లో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటికే నాగ చైతన్య పుట్టాడు. విడాకులు అనంతరం చైతూ తల్లి లక్ష్మితో పాటు వెళ్లిపోయారు. లక్ష్మి మరొకరిని వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ చైతు తాత రామానాయుడు లేదా తల్లి వద్ద పెరిగేవాడు. చైతూను నాగార్జున బాగా మిస్ అయ్యేవారట.
ఎప్పుడైనా హాలిడేస్ కి వచ్చి కొన్ని రోజులు ఉండి, మరలా వెళ్లిపోయేవాడట. తన వస్తువులన్నీ సర్దుకొని చైతూ ఇంటి నుండి వెళ్లిపోతుంటే నాగార్జునకు దుఃఖం ఆగేది కాదట. గుండె బరువెక్కి కన్నీరు పెట్టుకునేవారట. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాడోనని వేదన చెందేవాడట. నాగార్జున ఈ విషయం ఓ సందర్భంలో చెప్పి ఎమోషనల్ అయ్యారు. చైతూ తన తాత రామానాయుడు, మామయ్యలు వెంకటేష్ సురేష్ బాబుల వద్ద పెరిగినా హీరోగా నాగార్జునే లాంచ్ చేశారు. జోష్ మూవీతో నాగచైతన్య హీరో అయ్యాడు.
స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరకున్నా చైతూ తనకంటూ ఒక మార్కెట్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సవ్యంగా సాగుతున్న తన జీవితంలో కూడా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విభేదాలు తలెత్తాయి. 2021లో సమంత-చైతూ విడాకులు తీసుకున్నారు. ఇక కెరీర్ మీద దృష్టి పెట్టిన చైతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా కస్టడీ తెరకెక్కుతుంది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న కస్టడీ త్వరలో విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్. దూత అనే వెబ్ సిరీస్ చేశారు. అది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.