Nagababu: యువశక్తిలో వైసీపీ ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు పంపిన నాగబాబు మరోసారి అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీలోని కాపు నేతలపై ఆయన తాజాగాచేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పవన్ పై అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేసిన మరుక్షణమే స్పందిస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతెందుకు చిరంజీవిపై ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు విమర్శలు చేసినా ఊరుకోరు. అదే స్థాయిలో రియాక్టవుతుంటారు. గతంలో చాలా సందర్భాల్లో.. చాలామంది పెద్దలు నాగబాబు ఎన్ కౌంటర్ ను ఫేస్ చేశారు. మెగా ఫ్యాన్స్, జన సైనికుల్లో పూనకాలు తెచ్చే విధంగా నాగబాబు వ్యవహరిస్తుంటారు. రెండు రోజుల కిందటే మెగా బ్రదర్స్ పై కామెంట్స్ చేసిన రోజాకు గట్టిగానే హెచ్చరికలు పంపారు. ఆమె నోటిని మునిసిపాల్టీ చెత్తతో పోల్చారు. ఇప్పుడు ఏకంగా మగ ముత్తైదువులు అంటూ చలోక్తులు విసిరారు.

జనసేన శ్రీకాకుళం వేదికగా యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. జన సైనికుల నుంచి జనసేనాని వరకూ అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అటు మెగా బ్రదర్స్ ఇద్దరి కామెంట్స్ అధికార పార్టీని కలవరపెట్టాయి. దీంతో కాపు సామాజికవర్గం మంత్రులు, నేతలు మీడియా ముందుకొచ్చారు. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచెకు ఉన్న దారం పోగను కూడా టచ్ చేయలేకపోయావని ఎద్దేవా చేశారు. మంత్రి అంబటి రాంబాబు అయితే కళ్యాణాల పవన్ అంటూ కామెంట్స్ చేశారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు.. పిచ్చి కుక్క అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికార సాక్షి మీడియాతో పాటు సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ సైతం రకరకాల కామెంట్స్ పెడుతోంది.

వైసీపీ అటాక్ పై మెగా బ్రదర్ నాగబాబు రిప్లయ్ ఇచ్చారు. ట్విట్టర్ లో స్పందించారు. వైసీపీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలుపెట్టారు. వాయినాలు ఇచ్చి పంపండంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలు వాడే భాషకు ధీటుగా నాగబాబు వ్యాఖ్యలుంటాయి. గతంలో చాలా సందర్భాల్లో ఇవి ప్రస్పుటమయ్యాయి. అయితే యువశక్తి వేడి ఇంకా చల్లారక ముందే వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్లు కొనసాగిస్తున్నారు. దీంతో జన సైనికులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇది కదా దెబ్బకు దెబ్బ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.