Waltair Veerayya: సంక్రాంతికి మా హీరో సినిమా వస్తుందన్న సంతోషం ఒకవైపు థియేటర్స్ పూర్తి స్థాయిలో దొరుకుతాయో లేదోనన్న ఆందోళన మరోవైపు మెగా ఫ్యాన్స్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. థియేటర్స్ సమస్య మాకు వదిలేయండి. వీలైనన్ని థియేటర్స్ లో వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేస్తాము. ఓపెనింగ్ డే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా వాల్తేరు వీరయ్య ఒకటి రెండు ఆడే సినిమా కాదు. నెల రోజులు నిరవధికంగా ఆడే సినిమా. ఓపెనింగ్ డే ఎన్ని థియేటర్స్ లభించినా పర్లేదు. సినిమా లాంగ్ రన్ ఆడుతుంది కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బాస్(చిరంజీవి)ఆల్రెడీ సినిమా చూశారు. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని చెప్పారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మంచి సినిమా నిర్మించారు. మనం భారీ విజయం సాధించబోతున్నామని చిరంజీవి గారు మాతో పంచుకున్నారు. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య వీరవిహారం చేయనుందని రవిశంకర్ చెప్పకనే చెప్పారు. థియేటర్స్ దొరక్కుండా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నవారికి కూడా పరోక్షంగా ఆయన చురకలు వేశారు.
ఓపెనింగ్ డే దొరికినన్ని థియేటర్స్ లో విడుదల చేస్తాం. థియేటర్స్ పెద్ద మొత్తంలో లభించకపోయినా మాకు ఇబ్బంది లేదు. మా సినిమా ఎక్కువ రోజులు ఆడే సత్తా ఉన్నది. కాబట్టి ప్రేక్షకులు కొంచెం ఆలస్యమైనా సినిమా ఖచ్చితంగా చూస్తారని ఆయన పరోక్షంగా తెలియజేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నిర్మాత దిల్ రాజుకు ఈ మేరకు కౌంటర్ వేశారు. ఘాటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఒక రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య విడుదల తేదీలుగా ప్రకటించారు. అయితే దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రం విడుదల చేస్తున్నారు. ఇది డబ్బింగ్ మూవీ కావడంతో మొదట నిర్మాతల మండలి సంక్రాంతి విడుదలకు అభ్యంతరం తెలిపారు. అయితే దిల్ రాజు పంతం నెగ్గించుకున్నారు. ఇక తనను కాదని సొంతగా తమ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బతీయాలని దిల్ రాజు థియేటర్స్ లాక్ చేశాడనే ప్రచారం జరుగుతుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ విషయంలో అన్యాయం జరగనుందని వార్తలు వస్తుండగా… రవిశంకర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.