
Marriage Drama ఉత్తర భారతంలో అమ్మాయిల కొరత వేధిస్తోంది. అమ్మాయిలు దొరకడమే గగనం అవుతోంది. కన్యాశుల్కం చెల్లించి మరీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ లోని పేదింటి అమ్మాయిలను కొందరు పెళ్లి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ కోవలోనే ఓ కేటుగాడి తన భార్య స్నేహితురాలిని ట్రాప్ చేశాడు. ఆమె టీవీ సీరియల్స్ , సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పొట్టపోసుకుంటోంది. ఆమెను అద్దె భార్యగా వెళ్లాలని.. డబ్బులు వస్తాయని ఓ ఐదు రోజులు నటించాలంటూ ఒప్పించాడు. స్నేహితురాలు భర్తే కావడంతో నమ్మి వెళ్లిన ఆమె నిండా మునిగింది..
ముంబైకి చెందిన 21 ఏళ్ల యువతి టీవీ ఆర్టిస్ట్. నటి. ఈమెకు తన స్నేహితురాలు అయేషా భర్త కరణ్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. ఒక మధ్యప్రదేశ్ లోని వ్యక్తికి అద్దె భార్యగా వెళ్లాలని ఓ ఐదు రోజుల పాటు నటించాలంటూ కరణ్ ఆమెను నమ్మించాడు. డబ్బులు వస్తాయి అనడంతో ఆమె సరేనంది.
మార్చి 12న సదురు టీవీ ఆర్టిస్ట్ యువతి కరణ్ తో కలిసి మందసౌర్ గ్రామ బస్టాండ్ కు చేరుకుంది. అక్కడే మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ తో ఆమెకు పరిచయం అయ్యింది. అద్దె భార్యగా నటించాలని ముఖేష్ కోరాడు. తన కుటుంబం ముందు తన భార్య పాత్రను పోషించవలసి ఉంటుందని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకెళ్లిన ముఖేష్ తన కుటుంబం సమక్షంలో ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. యువతి డీల్ ప్రకారం ముఖేష్ ఇంట్లో నివసించడం ప్రారంభించింది. ఇంటి కోడలి పాత్రలో జీవించేసింది.
ఆరోరోజు ఈ నాటకానికి తెరపడుతుందని.. వెళ్లిపోవచ్చని ముఖేష్ ఆ యువతికి నమ్మించాడు. ఆరో రోజు రానే వచ్చింది. అయితే ముఖేష్ మాత్రం ఆమెను వెళ్ళనివ్వకుండా నిరాకరించాడు. ‘ఇది నిజమైన వివాహం అని.. నువ్వంటే నాకు ఇష్టం.. నీ ప్రేమలో పడిపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి తాను కరణ్ కు డబ్బులు చెల్లించానని’ ముఖేష్ బాంబు పేల్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి ఈ కూపం నుంచి బయటపడడానికి ప్రయత్నించింది. కరణ్ కు ఫోన్ చేసి తీవ్ర వాగ్వాదానికి దిగింది.
అనంతరం రహస్యంగా ముంబైలోని తన స్నేహితుడికి ఫోన్ చేసిన యువతి విషయం చెప్పి పోలీసులతో కలిసి రావాలని సూచించింది. స్నేహితుడు పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్‌కు రాగానే కరణ్, ముఖేష్ పారిపోయారు. ఆ యువతిని పోలీసులు రక్షించి ముంబైకి తీసుకొచ్చారు. లైంగిక వేధింపులకు గురయ్యిందా? అని ఆరాతీయగా అదేం లేదని ఆ యువతి పోలీసులకు చెప్పింది.
ఈమెను మోసం చేసి పారిపోయిన కరణ్-అయేషా జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనాభాలో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ కావడం మధ్యప్రదేశ్ లో ఇటీవల కాలంలో పెరిగింది. అందుకే రూ.50వేలు చెల్లించి మరీ వెనుకబడిన మహిళలను మధ్యప్రదేశ్ యువకులు కొని పెళ్లి చేసుకుంటున్నారు.