Homeజాతీయ వార్తలుMS Dhoni: ధోని హితబోధతోనైనా సన్ రైజర్స్ ఆటగాళ్లు మారేనా?

MS Dhoni: ధోని హితబోధతోనైనా సన్ రైజర్స్ ఆటగాళ్లు మారేనా?

MS Dhoni
MS Dhoni

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో హైదరాబాద్ జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది హైదరాబాద్ జట్టు. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోసారి బ్యాటర్లు విఫలమై స్వల్ప స్కోర్ కే పరిమితం కావడంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు.

ఈ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతున్న మ్యాచ్ ల సంఖ్య పెరుగుతోంది కానీ.. విజయాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో రెండు మాత్రమే హైదరాబాద్ జట్టు గెలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ జట్టు గాడిని పడుతుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు నుంచి ఇంతకుమించి ఆశించడం వృధా అన్న భావనకు అభిమానులు చేరిపోతున్నారు.

స్వల్ప స్కోర్ కే పరిమితమైన హైదరాబాద్ జట్టు..

చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం హైదరాబాద్ జట్టు ఆడిన మ్యాచ్ లో తొలుత హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం చెన్నై జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో డెవాన్ కాన్వే 77 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. ఓపెనర్ గా వచ్చిన ఈ ఆటగాడు తుది వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.

MS Dhoni
MS Dhoni

యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చిన ధోని..

మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై జట్టు కెప్టెన్ ధోని.. హైదరాబాద్ జట్టు యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు.. ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడేటప్పుడు సందర్భానుసారంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలను ధోని ఈ సందర్భంగా యువ క్రికెటర్లకు తెలియజేశాడు. మ్యాచ్ ఆడుతున్నంత సేపే ధోని అవతల జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసింది అంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. తాజాగా హైదరాబాద్ జట్టు యువ ఆటగాళ్లతోనూ మ్యాచ్ అనంతరం అదే పని చేశాడు ధోని. ధోని ఇచ్చిన విలువైన సూచనలు, సలహాలతో రానున్న మ్యాచ్ ల్లోనైనా జట్టు విజయానికి కృషి చేస్తారేమో చూడాలి.

వైరల్ గా మారిన ఫోటో..

హైదరాబాద్ జట్టు యువ ఆటగాళ్లకు ధోని సలహాలు, సూచనలు ఇస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సాధారణంగా ధోని మ్యాచ్ ముగిసిన తరువాత ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో సంభాషించడం తరచుగా చూస్తుంటాం. తాజాగా ధోని హైదరాబాద్ జట్టు ఆటగాళ్లతో ముచ్చటించడం హైదరాబాద్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ధోని సలహాలతోనైనా హైదరాబాద్ జట్టులో మార్పు వస్తుందేమో చూడాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular