
MP Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాదాపు చిక్కుముడులన్నీ వీడుతున్నాయి. సీబీఐ దూకుడుగా వ్యహరిస్తోంది. తుది విచారణ దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుంది. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీ అవినాష్ రెడ్డిపైనే ఉంది. భాస్కరరెడ్డి రిమాండ్ రిపోర్టులో సహ నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరును సీబీఐ అధికారులు జత చేశారు. దీంతో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అటు తెలంగాణ కోర్టుకు సైతం సీబీఐ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యమన్న సంకేతాలిచ్చింది. అందుకు గల కారణాలను సైతం కోర్టుకు వివరించింది.
సీబీఐ బలమైన వాదనలు..
అయితే తనను అరెస్ట్ చేస్తారని భావించిన ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని సోమవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం పిటీషన్ విచారణకు వచ్చింది. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌కుమార్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి తీరుతోనే కేసు విచారణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఎప్పుడూ ఏదో ఒక పిటీషన్ వేస్తుండడాన్ని గుర్తుచేశారు. కేవలం అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలంతోనే కాదని… అన్నిరకాల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. వివేకా హత్య వెనుక రాజకీయ, కుటుంబ కలహా లు, వాణిజ్య లావాదేవీలు, మహిళ వంటి కారణాలు చూపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కూడా సీబీఐ లాయర్ వాదించారు. వివేకా హత్య తరువాత దానిని గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్ రెడ్డి అని.. అక్కడ హత్య ఆనవాళ్లు లేకుండా ప్రయత్నించింది కూడా ఆయనేనని సీబీఐ బలంగా తన వాదనలు వినిపించింది. అయితే ముందస్తు బెయిల్ పై నేడు కోర్టు మరోసారి విచారణ జరపనుంది.
అరెస్టుకే చాన్స్..
ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని సీబీఐ స్పష్టం చేసింది. ఆయన విచారణకు హాజరైతే మాత్రం అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ ఇప్పటికే నోటీసులిచ్చింది. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు నేటికి వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణకు రానుంది. అయితే కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైతే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యే చాన్స్ ఉంది. బెయిల్ తిరస్కరణకు గురైతే ఆయన విచారణకు హాజరైన మరుక్షణం సీబీఐ అదుపులో తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది.అవినాశ్‌రెడ్డి పలుమార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరైనా… ఎప్పుడూ పూర్తిస్థాయిలో విచారణకు సహకరించలేదని.. ఆయన్ను ఎగ్జామిన్ చేయడం పూర్తికాలేదని సీబీఐ స్పష్టం చేయడంతో అరెస్ట్ అనివార్యం అన్న సంకేతాలిచ్చినట్టయ్యింది.

సునీత పిటీషన్ పై విచారణ
మరోవైపు కేసును మరింత స్ట్రాంగ్ గా తీసుకెళ్లేందుకు వివేకా కుమార్తె సునీత పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆమె వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్‌పైనా విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. దీంతో హై కోర్టు ఏం చెబుతుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికైతే నాలుగేళ్లు అటు తిరిగి..ఇటు తిరిగి విచారణలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తున్న ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 30లోగా విచారణ పూర్తిచేయాలన్న కసితో సీబీఐ పనిచేస్తోంది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుతో కేసు ముగస్తుందో లేక సూత్రధారుల పేర్లు బయటపడే చాన్స్ ఉందో చూడాలి.