Human Behavior: జంతువు మరో జంతువును చంపడం ఆటవిక ధర్మం. మనిషి మనిషిని చంపడం దారుణం. ఇటీవల కాలంలో హత్యల ఉదంతాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడుతోంది. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి మనిషిని అత్యంత దారుణంగా హత్య చేసేందుకు వెనకాడటం లేదు. దీంతో నూరేళ్లు జీవించాల్సిన వారు మధ్యలోనే పోతున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అన్న ఓ సినీకవి మాటలను నిజం చేస్తున్నారు. ఒక జంతువును మరో జంతువు ఆకలి తీర్చుకోవడానికి చంపుతుంది. చంపిన తరువాత దాని మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంటుంది. అది జంతు ధర్మం. కానీ మనిషిని మనిషి ఎందుకు చంపుతున్నాడు.

దాని వల్ల అతడికి ఒనగూడే ప్రయోజనాలేమిటో తెలియడం లేదు. మనిషిలో మరో రాక్షసుడు దాగి ఉన్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. జంతువుకంటే దారుణంగా మనిషి ప్రవర్తన ఉంటోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. మనిషిని హత్య చేసి ముక్కలుగా చేయడం ట్రెండ్ గా మారింది. ఢిల్లీలో హత్యకు గురైన శ్రద్ధను ఆమె ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచి ఫ్రిజ్ లో పెట్టడం సంచలనం సృష్టించింది.
అదే కోణంలో మరో హత్య కూడా చోటుచేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ భార్య భర్తను కొడుకుతో కలిసి అలాగే ముక్కలు ముక్కలుగా చేసింది. అనంతరం వాటిని గ్రౌండ్ లో పడేసింది. ఇలా హత్యలు జరగడం చూస్తుంటే మనం ఎక్కడున్నాం.
నాగరికత మారుతున్న కొద్దీ మనుషుల్లో పరివర్తన మారుతోంది. మనిషిని దారుణంగా హత్య చేసి ముక్కలుగా చేయాలంటే ఎంతటి తెగువ ఉండాలి. అంత తెగింపు ఉన్న వారు తమ భవిష్యత్ మార్చుకోకుండా ఎదుటి వారి ప్రాణాలు తీసేంత దుర్మార్గానికి ఒడిగట్టడం క్షమించరాని నేరం. ఇక్కడ హత్యలు చేసేది కూడా బంధువులే కావడం గమనార్హం. శ్రద్ధను హత్య చేసింది ఆమె ప్రియుడే. భర్తను హత్య చేసింది భార్యే. ఇలా మానవ సంబంధాలు కాస్త హత్యలకు దారి తీస్తున్నాయి. చెప్పిన మాట వినడం లేదని హత్య చేసే వరకు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

2022లో ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవడంతో మనుషుల్లో ప్రవర్తనలో రాక్షసత్వం పెరిగిపోతోందని చెబుతున్నారు. క్షణికావేశంలో హత్యలు చేస్తూ మళ్లీ ముక్కలు ముక్కలుగా చేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఎదుటి వారి ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. చట్టరీత్యా నేరమని తెలిసినా తమ పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మనిషి నిలువెత్తు ప్రాణం తీయడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో మొండితనం కావాలి. మనిషి తన ప్రవర్తన ఎలా ఉన్నా ఎదుటి వారిని అంతమొందించేందుకు సైతం వెనకాడటం లేదని అవగతమవుతోంది. ప్రాణాలు తీయడం జంతు సంస్కృతి. అది మనిషిలో కూడా ప్రవేశించింది. దీంతోనే ఎదుటి వారి ప్రాణాలు తీస్తూ మనిషిలో కూడా మరో రాక్షసుడు దాగి ఉన్నాడనే విషయాన్ని తేల్చి చెబుతున్నట్లు కనిపిస్తోంది.