Monsoon : జూన్ మూడో వారం దాటుతున్నా వర్షాల జాడలేదు. తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిగా మారుతున్నాయి. రాళ్లు పగిలిపోయేలా ఎండలు మండుతున్నాయి. రుతుపవనాలు వచ్చినా వర్షాలు కనికరించడం లేదు. ప్రతిరోజూ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బెంబేలెత్తిపోతున్నారు.
సాధారణంగా జూన్ రెండో వారానికే రుతు పవనాలు ప్రవేశించాలి. వర్షాలు ప్రారంభం కావాలి. కానీ ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైంది. ఈ నెల 17 తరువాత రాయలసీమ, దక్షిణ కోస్తాలో రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 19 నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాక తరువాత వర్షాలు ప్రారంభవుతాయి. కానీ ఈ ఏడాది భిన్న వాతావరణం నెలకొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అసాధరణ తుపానుగా మారి తీరానికి తాకింది. పది రోజుల పాటు ఆ ప్రభావం ఉంది. కానీ వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడలేదు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది సుదీర్ఘ వేసవి కొనసాగింది. జూన్ నెలాఖరు వరకూ ఎండలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 17 నుంచి 23 వరకూ రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీంతో 19 నుంచి వర్షాలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఖరీఫ్ ను ప్రారంభించేందుకు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తనాలు చల్లేందుకు ఏరువాకకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆలస్యమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.