
Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కోర్టు ముందు సీబీఐ తన బలమైన వాదనలు వినిపిస్తోంది. ప్రధానంగా రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికే వివేకా హత్య చేశారని సీబీఐ తరుపు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను, అందులో నిందితుల పాత్రను ప్రస్తావించారు. ముఖ్యంగా కడప జిల్లాతో పాటు పులివెందులలో తమ రాజకీయ ఎదుగుదలకు వివేకా అడ్డంకిగా నిలుస్తున్నారని భావించి హత్య కు తెగబడ్డారని కొన్ని ఘటనలను ఉదహరించారు. ప్రధానంగా 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి కుట్రపన్నారని.. అప్పటి నుంచి వారిపై వివేకా ఆగ్రహంగా ఉండేవారని.. మధ్యలో జరిగిన పరిణామాలే వివేకా హత్యకు దారితీశాయని సీబీఐ తన వాదనలు వినిపించింది.
ఆ రూ.40 కోట్ల కథ వెనక..
మరోవైపు వివేకా హత్యకేసులో రూ.40 కోట్లపైనా సీబీఐ కూపీ లాగుతోంది. ఆ డబ్బులు ఎక్కడివి? ఎవరి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు? అన్నది అన్న అంశాలపై సీబీఐ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో హత్య వెనక ఉన్న నగదు లావాదేవీలు, అసలు ఆ మొత్తం ఎవరి నుంచి వచ్చింది, ఎవరెవరి చేతులు మారింది అనే వివరాలను సీబీఐ రాబడుతోంది. అప్రూవర్ గా మారిన దస్తగిరి దీనిపై కీలక వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. వివేకాను హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయని… అందులో నాకు రూ.5 కోట్లు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని దస్తగరి చెప్పుకొచ్చాడు.. గంగిరెడ్డితో చర్చల తర్వాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్ నాకు రూ.కోటి ఇచ్చాడు. అందులో రూ.25 లక్షలు సునీల్ తీసుకుని తర్వాత ఇస్తానన్నాడు. రూ.75 లక్షల్ని మున్నా అనే వ్యక్తి దగ్గర దాచాను అని కూడా దస్తగరి చెప్పుకొచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని అనుసరించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
త్వరలో ఈడీ ఎంట్రీ..
మరో వైపు పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో ఇతర కేసుల మాదిరిగానే ఈడీ రంగంలోకి దిగి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ ఉచ్చు బిగుస్తున్న తరుణంలో ఈడీ కానీ రంగంలోకి దిగితే ఇక తమకు కష్టమేనని నిందితులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసు విచారణ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 30లోగా విచారణ చేపట్టాలని సీబీఐకి అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా ఏర్పాటుచేసిన సిట్ లో సీబీఐలోని కీలక అధికారులంతా భాగస్థులై ఉన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దూకుడు చూస్తుంటే మరింత లోతుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ‘కీ’లక వ్యక్తులు బయటపడే చాన్స్ ఉందని సైతం విశ్లేషకులు భావిస్తున్నారు.

సెలవు రోజుల్లోనూ విచారణ..
కేసు తీవ్రతతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. శనివారం రంజాన్, ఆదివారం సెలవు అయినా విచారణ కొనసాగించడానికే నిర్ణయించింది. కాగా ఎంపీ అవినాశ్ రెడ్డి శుక్రవారం మూడో రోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 6 గంటలపాటు సీబీఐ ప్రత్యేక బృందం అవినాశ్‌ను ప్రశ్నించింది విచారణ ఖైదీలుగా ఉన్న అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డితోపాటు మరో నిందితుడు ఉదయ్‌కుమార్ రెడ్డిని సుమారు 7 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం వారిద్దరినీ తిరిగి జైలుకు తరలించారు. ముగ్గుర్ని వేర్వేరుగా ఉంచి ప్రశ్నించారు. కేసుకు సంబంధించి ఒకరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరొకర్ని ప్రశ్నించి సమాధానాలు రాబడుతున్నట్లు తెలిసింది. మొత్తానికైతే అటు రాజకీయ కోణంతో పాటు రూ.40 కోట్ల అంశంపై సీబీఐ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెలాఖరుకు కేసుపై మరింత స్పష్టత వచ్చే చాన్స్ కనిపిస్తోంది.