Monalisa : నీలి కళ్ళతో.. ఆకర్షించే రూపంతో ఆకట్టుకున్న మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తోంది. ఆమె గురించి దాదాపు వారం పాటు సోషల్ మీడియాలో చర్చ జరిగిందంటే..ఆమెకు ఎలాంటి హైప్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, కుకూ, త్రెడ్స్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో ఆమెదే హవా కొనసాగింది. ఫలితంగా ఆమె ఎక్కడికి వెళ్ళినా జనం చుట్టు ముట్టడంతో తట్టుకోవడం వల్లకాలేదు. దీంతో “నా మానాన నన్ను బతకనివ్వండి.. నా బతుకు తెరువుకు అడ్డుపడకండి.. నా పని నేను చేసుకోనీవ్వండి” అంటూ ఆమె ప్రాధేయపడింది. అయినప్పటికీ ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న హైప్ చూసి కొంతమంది దర్శకులు సినిమాల్లో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల ఆమె ఒక సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇటీవల కేరళలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మోనాలిసా పాల్గొన్నది. ఫిబ్రవరి 14 వాలెంటెన్స్ డే నాడు బంగారు నెక్లెస్ ను బహుమతిగా అందుకున్నది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిపోయిన మోనాలిసా ఇప్పుడు తొలిసారిగా తన జీవితంలో విదేశీ పర్యటనకు వెళ్తోంది.
విదేశీ పర్యటనకు
మహా కుంభమేళ ద్వారా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మోనాలిసా ఈ నెల 26న నేపాల్ లో జరిగే శివరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నది. దీనికి సంబంధించి ఆమెకు ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఆమెతో సినిమా నిర్మిస్తున్న సనోజ్ మిశ్రా, మ్యూజిక్ కంపోజర్ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు.. ఇటీవల ఆమె కేరళలో ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆమెను చూడ్డానికి వేలాదిమందిగా అభిమానులు వచ్చారు.. ఇంతవరకు ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా.. ఆమెకు ఎటువంటి నేపథ్యం లేకపోయినా.. కేవలం సోషల్ మీడియా ద్వారా ఆమె విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఒక సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఫలితంగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంది. మొన్నటిదాకా దుర్భరమైన పేదరికంలో బతికిన ఆమె ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తోంది. మోనాలిసాకు సినిమా అవకాశాలు రావడంతో ఆమె కుటుంబం పూసలు అమ్ముకోవడం మానివేసింది. ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి మోనాలిసా ఎదుగుదలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఆమె సినిమా షూటింగ్లో సమయంలో వెంట వెళ్తున్నారు. త్వరలో వారితో ఇతర వ్యాపారాలు ప్రారంభించడానికి మోనాలిసా కసరత్తులు చేస్తోంది.