Chiranjeevi- Mohan Babu: నటనలో.. డైలాగ్ డెలివరీతోపాటు.. పాత్రల ఎంపిక, డ్రెసింగ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు. విలక్షణంతోపాటు వివాదాల్లోనూ ఆయన ముందే ఉంటారు. ఇండస్ట్రీపై ఒకటి రెండు వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తారు మోహన్‌బాబు. చలనచిత్ర రంగంలో మెగా ఫ్యామిటీ ఆధిపత్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే చిరంజీవి, మోహనబ్‌బాబు కలిసి ఒకే వేదిక పంచుకోవడం అరుదు. అప్పుడప్పుడు వచ్చే అవకాశాన్ని కూడా మోహన్‌బాబు ప్రశ్నించడానికి, విమర్శించడానికే వినియోగించుకుంటారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇలా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండే మోహన్‌బాబు చాలా రోజుల తర్వాత చిరంజీవిని అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు రెండు రోజుల తర్వాత ట్విట్టర్ వేదికగా మోహన్‌బాబు అభినందనలు తెలిపారు. ‘మై డియర్ చిరంజీవి గోవాలో జరుగుతున్న ఇఫి వేడుకలో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోబోతున్నందుకు అభినందనలు. షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో మీరు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు.

థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్..
మోహన్‌బాబు ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వినమ్రంగా రిప్లైయ్ ఇచ్చారు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అంటూ మోహన్‌బాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఎప్పుడూ చిరంజీవిపై విమర్శలు చేసే కలెక్షన్ కింగ్‌కు తొలిసారి చిరంజీవికి అవార్డు రావడంపై సానుకూలంగా స్పందించడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మోహన్‌బాబు అభిమానులు కూడూ స్వాగతిస్తున్నారు.
స్వర్ణోత్సవాల్లో రచ్చ..
తెలుగు సినిమా స్వర్ణోత్సవ వేడుకలు పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేదికపై మోహన్‌బాబు మెగాస్టార్ చిరంజీవిని నేరుగా అటాక్ చేశారు. తనదైన శైలిలో డైలాగ్స్‌తో విమర్శలు చేశారు. తనకు చిరంజీవి మంచి మిత్రుడు అంటూనే వాక్బాణాలు సంధించారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి దూరం పెరిగింది. గతంలో ఇద్దరూ కలిసి హీరోలుగా, విలన్, హీరోగా సినిమాలు చేశారు. కానీ, ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది సినిమా ఇండస్ట్రీ స్వర్ణోత్సవ వేడుకల వేదికపై బహిర్గతమైంది.

మా ఎన్నికల సమయంలోనూ..
గతేడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరిగాయి. ఇందులో మోహన్‌బాబు కొడుకు, హీరో మంచు విష్ణు ప్యానెల్ పోటీ చేసింది. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలిసింది. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు మంచు విష్ణు ప్యానెల్‌ను బహిరంగంగా వ్యతిరేకించారు. కానీ ఈ ఎన్నికల్లో.. మంచు ప్యానలే విజయం సాధించింది. కొడుకు గెలుపు తర్వాత మోహన్‌బాబు మీడియాతో మాట్లాడి మెగా ఫ్యామిలీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ – 2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మోహన్‌బాబు గతం మర్చిపోయి.. మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఇలాంటి గౌరవం లభిస్తున్నందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. ఇది మన తెలుగు చిత్ర సీమకు ఎంతో గర్వకారణం’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు.