https://oktelugu.com/

Mohan Babu: చట్టం కఠినంగా ఉంటే.. మనిషే కాదు, మోహన్‌బాబు కూడా దిగుతాడు.. దిగక తప్పదు!

వ్యవస్థ బలంగా ఉంటే.. వ్యక్తులు క్రమశిక్షణతో ఉంటారు. అప్పుడు ఆ సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. సరికొత్త విలువలను ప్రపంచానికి చాటి చెబుతుంది. ప్రబల శక్తిగా వెలుగొందుతుంది. అదే వ్యవస్థ వ్యక్తులకు భయపడితే.. వ్యక్తులు చేస్తున్న చేష్టల వల్ల వణికి పోతే విలువలు కాలగర్భంలో కలిసిపోతాయి. అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 16, 2024 / 08:41 AM IST

    Mohan Babu(7)

    Follow us on

    Mohan Babu: ఇటీవల అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అతడు నటించిన సినిమా విడుదలకు ముందు ఏర్పాటుచేసిన షో చూసేందుకు కుటుంబంతో సహా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి భార్య చనిపోయింది. అతని కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ వ్యక్తి అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు. అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు చంచల్ గూడ జైల్లో ఉంచారు. అనంతరం అతడికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ ఎపిసోడ్లో బాధిత వర్గం పక్షాన ఉండాల్సిన ప్రతిపక్షాలు.. సహజంగానే అల్లు అర్జున్ వైపు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది తప్పని తీర్మానించాయి.. కేటీఆర్ లాంటి వాళ్ళైతే ట్విట్టర్ వేదికగా చాంతాడంత మెసేజ్ టైప్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ మధ్య తెలంగాణలో ప్రతిపక్షాలు ఎలాంటి టర్న్ తీసుకుంటున్నాయో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇక కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకం అయితే చాలు.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన తర్వాత అతడికి పరామర్శలు పెరిగిపోయాయి. సహజంగా ఇలాంటి ఘటనలో ఎవరైనా సామాజిక స్పృహ ఉన్నవాళ్లు బాధిత పక్షం వైపు ఉంటారు. అయితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ వైపు ఉంది. అభిమానులంటే హీరోలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

    మోహన్ బాబు దిగి వచ్చాడు..

    అల్లు అర్జున్ ఎపిసోడ్ కంటే ముందు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన రచ్చ మామూలుది కాదు. ఏకంగా ఆ రోజుల తరబడి బౌన్సర్లు జల్పల్లి ప్రాంతంలో ఆయన నివాసంలో తిష్టవేశారు. మంచు మనోజ్ ఆ నివాసంలోకి దూసుకు రావడం.. మోహన్ బాబు మనుషులు అతడిని అడ్డుకోవడం.. దీనిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు బౌన్సర్ల చేతిలో ఊహించని ప్రతిఘటన ఎదురు కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ప్రతినిధిని మోహన్ బాబు కొట్టడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో అతనికి గాయం కూడా అయింది. ఇది కాస్త తీవ్రమైన చర్చకు దారి తీసింది. జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు పై మండిపడ్డాయి. మోహన్ బాబు కూడా ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుకు బెయిల్ లభించకపోవడం.. అల్లు అర్జున్ ఎపిసోడ్ కళ్ళముందే కనిపించడంతో.. ఆయన కూడా మెట్టు దిగక తప్పలేదు. రేవంత్ రెడ్డి ఎవరి మాటా వినే పరిస్థితి లేదు. వినేస్థితిలో కూడా అతడు లేడు. సామాన్యుడికి, మాన్యుడికి చట్టం ఒకే విధంగా ఉంటుంది అనే సందేశం ఇస్తున్నాడు. అదేవిధంగా నడుచుకుంటున్నాడు. కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. తర్వాత ఏం జరగబోతుందో మోహన్ బాబుకు అర్థమైంది. అందువల్లే అతడు దిగివచ్చాడు. తన చేతిలో గాయపడిన న్యూస్ ఛానల్ ప్రతినిధికి క్షమాపణలు చెప్పాడు. అందుకే అంటారు చట్టం కఠినంగా ఉంటే ఎవరైనా సరే కిందికి దిగాల్సిందే. దిగి రావాల్సిందే. మనిషే కాదు.. చివరికి మోహన్ బాబు కూడా తలవంచాల్సిందే