Ramoji Rao- MM Keeravani: ఆస్కార్ గెలిచిన కీరవాణి, చంద్రబోస్ లను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించుకున్నాయి. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి టాలీవుడ్ కి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో కీరవాణి స్పీచ్ నిరాశ నిస్పృహ గా సాగింది. దీని వెనుక కారణాలేంటో తెలియదు. ఆస్కార్ గెలిచిన ఆనందం ఆయనలో కనిపించలేదు. తన మొదటి సాంగ్ రికార్డు చేసిన రోజు పొందిన అనుభూతి కంటే ఆస్కార్ చిన్నదే అన్నారు. దాన్ని ఒక కప్పు టీతో పోల్చారు. ఆస్కార్ గెలుచుకోవడం నాకు పెద్ద ఎగ్జైట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఓకే… ఆస్కార్ వచ్చింది. ఈ సన్మానం అవసరమా అన్నట్లు మాట్లాడారు. సందర్భం ఏదైనా టాలీవుడ్ అంతా ఒక చోట చేరడం ఆనందం అన్నారు. ఇలా అప్పుడప్పుడు కలుసుకోవడం మంచి పరిణామం అన్నారు.
సాధారణంగా ఒక అవార్డు గెలిచినప్పుడు ఎవరూ దాని క్రెడిట్ సోలోగా తీసుకోరు. నా వల్లే ఇది సాధ్యమైంది అంటే ఇతరులను తక్కువ చేసినట్లు అవుతుంది. జనాలు కూడా హర్షించరు. కాబట్టి విజేత తన సక్సెస్ క్రెడిట్ తాను తీసుకుంటూనే టీం మెంబర్స్ కి కూడా పంచుతారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వేదికలపై ఆయన కొందరి పేర్లు మాత్రమే ప్రస్తావించారు. అలా ఎందుకు చేశారో నిన్న వివరణ ఇచ్చారు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్స్ లో నిమిషం లోపే మన స్పీచ్ కంప్లీట్ చేయాలి. అందుకే మనస్ఫూర్తిగా మాట్లాడటం కుదర్లేదన్నారు.
నిన్న సుదీర్ఘ సందేశం ఇవ్వగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ప్రస్తావించింది రెండు పేర్లే. ఇద్దరికి మాత్రమే క్రెడిట్ ఇచ్చాడు. అదే సమయంలో తనతో పాటు చంద్రబోస్ ని తక్కువ చేసి మాట్లాడారు. నేను, చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలం. మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ అని అన్నారు. ఈ సన్మానాలు, గౌరవాలు నిజానికి రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ లకు దక్కాలని ఆయన ఉద్దేశం. ఎప్పటిలాగే నిర్మాత ప్రస్తావన రాలేదు. ‘ఆ ఇద్దరు హీరోలు’ అన్నారు కానీ కనీసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు.
నిర్మాత, హీరోలు, సింగర్స్ ని గుర్తు చేసుకోని కీరవాణి ఆర్ ఆర్ ఆర్ తో సంబంధం లేని రామోజీ రావు గురించి రెండు నిమిషాలు కేటాయించి మాట్లాడటం ఆసక్తికర పరిణామం. ఆయన కోసమే ఆస్కార్ గెలిచాను. ఆయన చెప్పాకే ఆస్కార్ విలువ తెలిసొచ్చిందని చెప్పడం కొసమెరుపు. ‘మా ఆవిడ జీవితంలో ఒక్కరోజైనా రామోజీరావులా బ్రతకాలని అంటుంటుంది. నేను ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆస్కార్ తీసుకురండి అన్నారు. అప్పుడు దాని విలువ నాకు తెలిసొచ్చింది. రామోజీరావు అంతటి గొప్ప వ్యక్తి దృష్టిలో ఆస్కార్ కి ఇంత విలువ ఉందా! అనిపించింది. అప్పుడు ఆస్కార్ గెలవాలనే కోరిక కలిగింది’ అన్నారు.
ఎన్టీఆర్ కోసం కాదు, రామ్ చరణ్ కోసం కాదు, రాజమౌళి కోసం కాదు, దేశం కోసం కాదు… చివరికి ఆయన కోసం కూడా కాదు. కీరవాణి కేవలం రామోజీరావు కోసం ఆస్కార్ గెలిచారు. కాబట్టి… ది ఆస్కార్ గోస్ టు రామోజీరావు.