Moi Virunthu: ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తాం.. మనకు తెలిసిన వారిని అప్పులు అడుగుతాం. కానీ తమిళనాట మాత్రం ఓ వింత సంప్రదాయం ఉంది.అదే ‘కట్నాలు లేదా చదివింపులు’. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు తోచినంతగా కానుకలు, కట్నాలు చదివిస్తాం.. ఫంక్షన్లు నిర్వహించే వ్యక్తికి ఆర్థికంగా చేయూత అందించడం కోసం ఇలా చేస్తుంటాం. కానీ తమిళనాడులో మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు క్రౌడ్ ఫండింగ్ కోసం విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆతిథ్యం స్వీకరించిన వారు చదివింపుల రూపంలో తమకు చేతనైన సాయం చేస్తారు. అలా సమకూరిన డబ్బుతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. తర్వాత ఎదుటివాళ్లు విందు భోజనం పెట్టినప్పుడు సదురు వ్యక్తి కూడా వారికి ఇలాగే చదివింపుల రూపంలో సాయం చేస్తుంటాడు.

తమిళనాడులోని పుదుకొట్టాయ్, తంజావూరు ప్రాంతాల్లో ఇలాంటి విందు భోజన చదివింపుల సంప్రదాయం అనాదిగా ఉంది. తమిళ నెలలు అయిన ఆడి, అవని నెలల్లో ‘మోయి విరుంతు’ పేరిట ఈ విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒక వ్యక్తి ఐదేళ్లలో ఒకసారి మాత్రమే విందు భోజనాలు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది.
తాజాగా పెరవురణి డీఎంకే ఎమ్మెల్యే అశోక్ కుమార్ సైతం మోయి మంగళవారం విరుంతును విందు ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అశోక్ కుమార్.. తన మనవరాలి చెవులు కుట్టించే వేడుకతోపాటు విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనానికి 15వేల మంది అతిథులు హాజరయ్యారు. వారి కోసం పలు రకాల వంటకాలను సిద్ధం చేశారు. 15 క్వింటాళ్ల మటన్ వండారు. శాకాహారులు, మంసాహారులకు విడివిడిగా భోజనాలు ఏర్పాటు చేశారు. డబ్బులు వేయడానికి 40 కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరూ డబ్బు ముట్టుకోకుండా చూడడం కోసం సెక్యూరిటీ గార్డులతోపాటు సీసీ టీవీ కెమెరాను నిఘా పెట్టారు.

ఎమ్మెల్యే విందు భోజనం ఆరగించిన ప్రజలు రూ.1000 నుంచి రూ.5 లక్షల వరకూ తమకు తోచినంతగా డబ్బులను విరాళంగా అందజేశారు. మంగళవారం సాయంత్రం నుంచి లెక్కింపులు జరపగా.. బుధవారం మధ్యాహ్నం వరకూ డబ్బు లెక్క తేలింది. నోట్ల మెషీన్లతో లెక్కించాల్సి వచ్చింది. చదివింపుల రూపంలో ఏకంగా రూ.10 కోట్లు వచ్చాయని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.
ఏకంగా ఎమ్మెల్యే పెట్టిన విందు కావడంతో నియోజకవర్గ ప్రజలు, తెలిసిన బడా బాబులు అంతా ఇలా విందులో పాల్గొని భారీగా డబ్బులు చదివించారని తెలుస్తోంది. ఆ చదివింపులు ఏకంగా రూ.10 కోట్లు ఉండడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.


[…] Also Read: Moi Virunthu: విందుభోజనం పెట్టిన ఎమ్మెల్యే.. చ… […]