Miss World 2024: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మిస్ వరల్డ్ ఇండియా.. ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చంటే?

ముంబై వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీలు 71 వ ఎడిషన్ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పోటీలు భారత్ వేదికగా 1996లో జరిగాయి. ఈసారి మిస్ వరల్డ్ పోటీలలో ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత అయిన సినీ శెట్టి బరిలోకి దిగుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 20, 2024 7:18 pm
Follow us on

Miss World 2024: మిస్ వరల్డ్ పోటీలకు ముంబై నగరం ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 9 న పూర్తవుతాయి. ఈ వేడుక కోసం యావత్ ప్రపంచంలోని అందమైన యువతులు తరలివచ్చారు. సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు ఈ పోటీలకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఈసారి మన దేశం నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీల్లో బరిలోకి దిగుతోంది.

ముంబై వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీలు 71 వ ఎడిషన్ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పోటీలు భారత్ వేదికగా 1996లో జరిగాయి. ఈసారి మిస్ వరల్డ్ పోటీలలో ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత అయిన సినీ శెట్టి బరిలోకి దిగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి అందమైన యువతులు వచ్చారు. ఈ అంశంపై ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో మాజీ ప్రపంచ సుందరి, పోలాండ్ దేశానికి చెందిన కరోలినా బిలావ్స్కా, మాజీ విజేతలు టోనీ ఆన్ సింగ్, వెనెస్కా పోన్స్ డి లియోన్, భారత్ కు చెందిన మానుషి చిల్లార్ హాజరయ్యారు. వివిధ పత్రికలు, న్యూస్ ఛానల్స్ కు చెందిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆడపిల్లల్లో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని.. అంతర్గత అందాన్ని ఈ పోటీలు ఆవిష్కరిస్తాయన్నారు. అందమంటే ఆంగాంగ ప్రదర్శన కాదని.. దానికి కొలమానం వేరే ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి అందాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమని వారు వివరించారు. కాగా, ఈసారి మిస్ వరల్డ్ పోటీలలో ఇండియా తరఫున ఫెమినా మిస్ ఇండియా 2022 విజేత సినీ శెట్టి బరిలోకి దిగుతున్నారు.

సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం.. ఈమె అకౌంటింగ్ తో పాటు ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సినీశెట్టి పేర్కొన్నారు. “1.4 బిలియన్ ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని” సినీ శెట్టి పేర్కొన్నారు. దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించడం అతి పెద్ద బాధ్యత అని సినీశెట్టి అన్నారు.

1996 లో మిస్ యూనివర్స్ పోటీలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతంలో జరిగాయి. ఆ పోటీల్లో 130 దేశాలకు చెందిన అందమైన యువతులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన ఆరుగురు మహిళలు మిస్ వరల్డ్ కిరిటాలు చేసుకున్నారు. 1966 లో మొట్టమొదటిసారిగా రీటా ఫారియా ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి మిస్ యూనివర్స్ కిరీటాలు సొంతం చేసుకున్నారు. 2006లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ ఘనతను సాధించారు. ఈ వేడుకలను 1951లో యునైటెడ్ కింగ్డమ్ లో ఎరిక్ మోర్లి ప్రారంభించారు. ఆయన అప్పట్లో టెలివిజన్ వ్యాఖ్యాతగా ఉండేవారు. అతని ద్వారా ఈ పోటీలకు ఎనలేని ప్రచారం లభించింది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ పోటీలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ పోటీలకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి.