Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: కొడాలి నాని మాస్ వార్నింగ్.. వాళ్లకు దిమ్మతిరిగిపోయింది

Kodali Nani: కొడాలి నాని మాస్ వార్నింగ్.. వాళ్లకు దిమ్మతిరిగిపోయింది

Kodali Nani: మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మీడియా దాని తీరుగా అది ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదని.. ఆ మీడియా మాటున కొంతమంది రాస్తున్న రాజకీయ అనుకూల రాతలే వల్లే ఇన్ని అనర్ధాలని.. అదృష్టవశాత్తు తెలంగాణలో ఇలాంటి పోకడలు లేకపోయినప్పటికీ.. ఆంధ్రలో మాత్రం చాలా అంటే చాలా. పలుమార్లు అవి వెలుగు చూశాయి కూడా. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రోజుకో సంచలనం బయటికి వస్తోంది. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలు ఎవరికి వారుగా విడిపోతున్నారు. పార్టీల అధినేతల కంటే ఎక్కువగా వైరం పెంచుకుంటున్నారు. అయితే ఈ రాజకీయాలలో మీడియా నలిగిపోతుండడం.. బాధితురాలిగా మిగిలిపోతుండడం అత్యంత విషాదం.

సిద్ధం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాను బాగు చేస్తుంటే కొంతమంది మీడియా పెద్దలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి బురద చల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సిద్ధం సభకు జన సమీకరణ బాధ్యతను స్థానికంగా ఉన్న నాయకులు భుజాన వేసుకుంటున్నారు. జగన్ కు వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థలు సిద్ధం సభకు సంబంధించి నెగిటివ్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి, ప్రచురిస్తున్నాయి. సహజంగానే వైసీపీ నాయకులకు ఇది నచ్చడం లేదు. అందుకే వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థల తీరును సోషల్ మీడియాలో ఎండ కడుతున్నారు.

తాజాగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సంబంధించి ఫోటోలు తీసుకునేందుకు వెళ్లిన ఓ పేపర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ను వైసిపి నాయకులు చితకబాదారు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సహజంగానే టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ మందలించారు..

ఓ పత్రికకు సంబంధించిన స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పై దాడి అనంతరం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు..” వైసీపీ సమావేశాలకు రావద్దని మేము ముందుగానే కొన్ని పత్రికలకు, న్యూస్ చానల్స్ అధిపతులకు చెప్పాం. వారిపై నిషేధం విధించాం. అయినప్పటికీ వారు మా సమావేశాలకు వస్తున్నారు. మాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. అలాంటప్పుడు మా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కదా. ఈసారి ఆ పత్రికల అధిపతులు, న్యూస్ ఛానల్స్ ఎండీలు వస్తే కీళ్లు విరగ్గొడతారు. ఒకవేళ వాళ్ల పార్టీ సమావేశాలకు మా పార్టీకి అనుబంధంగా పనిచేసే పత్రిక, న్యూస్ ఛానల్ పాత్రికేయులు వెళ్తే వారు కూడా ఇదే చేస్తారు” అంటూ కొడాలి నాని హెచ్చరించారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రధాన మీడియాలో, సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై టిడిపి, పాత్రికేయ సంఘాల నాయకులు మండిపడుతున్నాయి. నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version