Homeఆంధ్రప్రదేశ్‌Punganur Politics: పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకం... జనసేన నేత ఇంటిపై వైసీపీ అల్లరిమూకల దాడి

Punganur Politics: పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకం… జనసేన నేత ఇంటిపై వైసీపీ అల్లరిమూకల దాడి

Punganur Politics: ఏపీలో వైసీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడాన్ని కూడా సహించలేకపోతున్నారు. ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా చిత్తూరులో జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ అల్లరిమూకలు రెచ్చిపోయాయి. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్నవారు రామచంద్రయాదవ్ పై దాడికి ప్రయత్నించారు. ఆయన కనిపించకపోయే సరికి ఆయన ఇంటిని, ఇంటి బయట ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Punganur Politics
Punganur Politics

రామచంద్రయాదవ్ పారిశ్రామికవేత్త. గత ఎన్నికల్లో ఆయన పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఓటమి ఎదురైనా జనసేన పార్టీని మాత్రం వీడలేదు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇది మింగుడుపడని పెద్దిరెడ్డి అనుచరులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా రామచంద్ర యాదవ్ మాత్రం తగ్గేది లేదంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై సదుంలో ఆయన రైతుభేరీ నిర్వహించారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఇంతలో వైసీపీకి వ్యతిరేకంగా సభ పెడతావా అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు పుంగనూరు పట్టణంలోని ఎల్ఐసీ కాలనీలో రామచంద్రయాదవ్ కొత్తగా నిర్మించుకున్న ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని, బయట ఉన్న ఆరు కార్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న రామచంద్రయాదవ్ ప్రాణభయంతో ఓ రూమ్ లో దాక్కోవాల్సి వచ్చింది. అయితే అక్కడే పోలీసులు ఉన్నా నిలువరించే ప్రయత్నం చేయలేదు.

అయితే చిత్తూరు జిల్లాలో జనసేనపై దాడులు కొత్త కాదు. గతంలో కూడా జనసేన నేతలే టార్గెట్ గా వైసీపీ శ్రేణులు దాడులు చేసిన సందర్భాలున్నాయి. అటు పోలీసులు కూడా అక్రమ కేసులు బనాయించారు.మంత్రి రోజా ఫిర్యాదు, ప్రోత్సాహం మేరకు గత నెల 12న జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జి కిరణ్ రాయల్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీ విశాఖ టూర్ కి రావడం, అదే రోజు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందడంతో ప్రధానిని కలిసేందుకు వెళ్లారు. మీడియాలో ఇది హైప్ అవుతుండడంతో తట్టుకోలేని వైసీపీ అగ్రనేతలు తిరుపతిలో కిరణ్ రాయల్ అక్రమ అరెస్ట్ కు తెరతీశారు. కానీ నాటి ఎపిసోడ్ లో జనసేన శ్రేణులు భయపడలేదు. చివరకు కిరణ్ రాయల్ ను పోలీసులు విడిచిపెట్టక తప్పలేదు. ఇప్పుడు మరో మంత్రి పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో రామచంద్రయాదవ్ పై దాడికి దిగి విఫలమయ్యారు.

Punganur Politics
Punganur Politics

ఈ ఘటనపై జనసేన హైకమాండ్ స్పందించింది. ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ ఘటనను ఖండించారు.మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరులో రైతుసభ నిర్వహించడమే రామచంద్రయాదవ్ చేసిన తప్పిదమా అని ప్రశ్నించారు. వైసీపీ అల్లరిమూకలు దాడిచేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏపీలో వైసీపీ నేతలు రాజకీయ వికృత క్రీడకు పాల్పడుతున్నారని.. దీనికి ప్రజలు చెక్ చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మీ బెదిరింపులకు జనసైనికులు భయపడరని కూడా హెచ్చరించారు. మరోసారిఇటువంటి ఘటనలకు పాల్పడితే నేరుగా పవన్ కలుగజేసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు పంపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version