TTD: నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టుంది టీటీడీ తీరు. ఒక వైపు సౌకర్యాలు కల్పిస్తూనే.. మరోవైపు భక్తుల మీద ధరల భారం మోపుతున్నారు. ఇటీవల అద్దె గదుల ధరలు అమాంతం పెంచేశారు. లడ్డూ ధరలు, ఆర్టీసీ టికెట్ ధరలూ పెంచేశారు. ఇప్పుడేమో కొత్త నిత్యాన్నదాన సత్రాల నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో లాగేస్తూ సామాన్య భక్తులకు అర్థంకాని రీతిలో టీటీడీ వ్యవహార శైలి సాగుతోంది.

శ్రీవారి భక్తుల కోసం శ్రీవారి మెట్టుకు అత్యంత సమీపంలో ఉండే ఎంబీసీ రోడ్డులో మినీ నిత్యాన్నదాన కాంప్లెక్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. మినీ కాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం ఈ మినీ అన్నదాన సత్రం నిర్మించనున్నారు.
తిరుమలలో చాలా చోట్ల నిత్యాన్నదాన సత్రాలను టీటీడీ నిర్వహిస్తోంది. నిత్యాన్నదాన సత్రాల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉన్నప్పటికీ.. ఇటీవల అద్దె గదుల రేట్ల పెంపు పై మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. ఒక్కసారిగా 1100 శాతం రేట్లను పెంచితే సామాన్యుడు తిరుమలకు వచ్చేదెలా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అన్నదాన సత్రాల్లో పేద భక్తులు మాత్రమే భోజనం చేస్తారు. ధనవంతులు తమకిష్టమైన చోట తింటారు. అద్దె గదుల విషయంలో అలా కాదు. అద్దె గదుల రేట్ల పెంపు ధనవంతులకు పెద్ద ఇబ్బందిగా ఉండకపోవచ్చు. కానీ సామాన్యులకు మాత్రం తలకు మించిన భారం అని చెప్పక తప్పదు.

టీటీడీ సౌకర్యాలు కల్పిస్తూనే ధరల పేరుతో బాదడం పై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం అద్దె గదుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల తరహాలో అద్దె గదుల ధరలు పెంచడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు లాడ్జీలు లాభాపేక్షతో ధరలు పెంచుతాయి. కానీ టీటీడీ ఎందుకు పెంచిందో ఇప్పటికీ అర్థం కాలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో తీసుకునే స్వభావాన్ని విడనాడాలని భక్తులు కోరుతున్నారు.