This Week Box Office: స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో లేనట్లే. సంక్రాంతి ముగియడంతో వాళ్లు రిలాక్స్ అయ్యారు. ఎప్పుడో కానీ చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు. గత వారం మూడు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ బరిలో దిగాయి. వీటిలో భారీ హైప్ మధ్య విడుదలైంది మాత్రం మైఖేల్. మైఖేల్ మూవీ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాన్ ఇండియా మూవీ అనడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. కొంతలో కొంత రైటర్ పద్మభూషణ్ చిత్రానికి కూడా ప్రచారం దక్కింది. బుట్టబొమ్మ మూవీ గురించి కూడా జనాల్లో చర్చ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కావడంతో ఆడియన్స్ లో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
మరి ఈ మూడు చిత్రాల్లో విన్నర్ ఎవరో చూద్దాం. సందీప్ కిషన్ మైఖేల్ నిరాశపరిచింది. ఈ మూవీపై సందీప్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మైఖేల్ మూవీ రూపంలో హిట్ పడుతుందని భావించాడు. కానీ మైఖేల్ రొటీన్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకులు తేల్చేశారు. మంచి ఆరంభం లభించినా ఆ టెంపో దర్శకుడు రంజిత్ జయకోడి మైంటైన్ చేయలేకపోయాడు. దారుణమైన వసూళ్లు అందుకున్న మైఖేల్ ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.
దర్శకుడు చంద్రశేఖర్ టి రమేష్ తెరకెక్కించిన బుట్ట బొమ్మ పరిస్థితి కూడా ఏం బాగోలేదు. సినిమాలో విషయం లేదని తేల్చేశారు. విశ్వాసం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న అనికా సురేంద్రన్ హీరోయిన్ గా పరిచయమైన బుట్టబొమ్మ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. తెలుగులో అనికా నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్ లో నటించారు. మాస్టర్ మూవీ ఫేమ్ అర్జున్ దాస్ కీలక రోల్ చేశారు. మొత్తంగా బుట్ట బొమ్మ చిత్రంపై ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి లేదని ఓపెనింగ్స్ తో తెలిసిపోయింది.
మైఖేల్, బుట్ట బొమ్మ నిరాశపరచగా రైటర్ పద్మభూషణ్ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుహాస్ హీరోగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులు భావిస్తున్నారు. మధ్య తరగతి యువకుడి కష్టాలు, ఫ్యామిలీ డ్రామాతో కలిపి చెప్పిన విధానం బాగుందని ఆడియన్స్ అభిప్రాయం. లవ్, ఎమోషన్స్ కూడా పండటంతో రైటర్ పద్మభూషణ్ ఈ వీక్ విన్నర్ అంటున్నారు. ఇక వసూళ్లు కూడా బాగున్నాయి. కలర్ ఫొటో మూవీతో మెప్పించిన సుహాస్ కి కమర్షియల్ హిట్ పడింది.