
Medak Lockup Death: ఒక పేదవాన్ని దొంగతనం కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. అతడిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెడతారు.. ఆ దెబ్బలకు తాళ లేక అతడు కన్నుమూస్తాడు. దీనికి మసి పుసి మారేడు కాయ చేసేందుకు పోలీసులు నానా తంటాలూ పడతారు. చివరకు చట్టానికి చిక్కి శిక్ష అనుభవిస్తారు. గత ఏడాది ఓటీటీ లో వచ్చిన జై భీమ్ సినిమా కథ ఇది.. ఇటీవల మెదక్ లో పోలీసుల దెబ్బలకు ప్రాణాలు విడిచిన ఖదీర్ మృతి కేసు కూడా అచ్చం ఇలాంటి మలుపులే తిరుగుతోంది. విస్తు పోయే వాస్తవాలను కళ్ళకి గడుతోంది.
అచ్చం అలానే ఉంది
ఈ కేసులోనూ పోలీసుల తీరు ఇంచుమించు ఆ సినిమాలోని పోలీసుల తరహాలోనే ఉంది.. విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో డిజిపి అంజని కుమార్ ఐ జి నేతృతంలో విచారణకు ఆదేశించారు.. ఇది ప్రారంభించిన 24 గంటల్లోనే మెదక్ పట్టణ సీఐ మధు, ఎస్సై రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్ ను సస్పెండ్ చేస్తూ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు.
దొంగగా అనుమానించారు
ఇక మెదక్ లో పోలీసులు చైన్ స్నాచింగ్ కేసులో ఖదీర్ ను దొంగగా అనుమానించారు. జనవరి 29న అతడిని హైదరాబాదులోని తన బంధువుల ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో అతడిని ఫిబ్రవరి 3 వరకూ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.. ఈ సమయంలోనే అతడిని చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది.. అప్పటికి అతడిని ఓ ఇంట్లో నిర్బంధిస్తే పారిపోయి మొదట మెదక్, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది.. అయితే ఖదీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అతడిని కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 9, 10, 11 తేదీల్లో అతడికి చేసిన చికిత్సకు 80, 300 బిల్లు అయింది. ఆ బిల్లును ఖదీర్ ప్రమేయం లేకుండానే పోలీసుల తరఫున మధ్య వర్తిత్వం నిర్వహించిన ఓ వ్యక్తి బిల్లు చెల్లించినట్టు సమాచారం.
హైదరాబాద్ తరలించారు
అయినప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు.. దీంతో అక్కడి నుంచి అతన్ని హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో దాన్ని దారి మళ్ళించారు.. 12వ తేదీ తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఖదీర్, అతడి భార్యను హైదరాబాద్ శివారులోని కౌకుర్ దర్గా వద్ద వదిలి వెళ్లారు.. అక్కడ వారు ఒక గంట సేపటి దాకా అక్కడే ఉన్నారు.. అతని పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో వారు కింద మీద పడి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు.. అక్కడ కూడా వారి కదలికలను పోలీసుల తరఫున పో వ్యక్తి అనుక్షణం గమనించినట్టు తెలుస్తోంది. అయితే సదరు మధ్య వర్తి ఖదీర్ ను మాదా పూర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చెప్పించి, అత్యంత ఖరీదైన వైద్యం అందిస్తానంటూ ప్రలాభపెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు సమాచారం. అయితే అప్పటికే ఖదీర్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో కన్నుమూశాడు.
అంబులెన్స్ లు మార్చి, బిల్లులు కాల్చి..
ఇది మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసులు వచ్చేవరకు గాంధీ ఆసుపత్రి వైద్యులు ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. కుటుంబ సభ్యులు మెదక్ పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు వచ్చిన తర్వాత వైద్యులు పోస్టుమార్టం చేసి ఖదీర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.. గాంధీ ఆసుపత్రి నుంచి ఖదీర్ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సులో అతని బావ కూర్చున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఖదీర్ బావను అందులో నుంచి దింపేశారు.. మృతదేహాన్ని మరో అంబులెన్స్ లోకి మార్చారు.. గాంధీ ఆసుపత్రిలో అంబులెన్స్ తో పాటే బయలుదేరిన ఖదీర్ భార్య సిద్దేశ్వరి, కుటుంబ సభ్యులు తుఫాన్ వద్ద అగి…ఖదీర్ ను తరలిస్తున్న అంబులెన్స్ కోసం ఎదురు చూస్తుండగా.. మరో అంబులెన్సులో గంట ఆలస్యంగా చేరుకున్నారు.. అక్కడ కూడా అంబులెన్స్ నుంచి ఏవో వస్తువులు తీసి, కొంత దూరం వెళ్ళాక కాల్చేశారు. వారు ఆసుపత్రికి సంబంధించిన పత్రాలనే కాల్చేశారని ఖదీర్ భార్య సిద్దేశ్వరి ఆరోపిస్తున్నారు.

చిత్ర హింసలకు గురి చేశారు
” ఖదీర్ నేనూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. కష్ట పడి పని చేసి కుటుంబాన్ని సాకుతున్నాడు. చైన్ స్నాచింగ్ జరిగింది అని పోలీసులు చెబుతున్న రోజు అతడు ఇక్కడ లేడు. ఎవరో చెబితే ఖదీర్ ను పోలీసులు తీసుకెళ్లారు. చిత్రహింసలకు గురి చేశారు. అతడు చనిపోయాక మూడు అంబు లెన్స్ లు మార్చారు. అంతే కాదు హాస్పిటల్ బిల్లులు మొత్తం కాల్చేశారు. ఎస్ఐ రాజశేఖరే దీనికి కారణం” అని ఖదీర్ భార్య ఆరోపిస్తోంది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసుల పై చర్యలు తీసుకోక పోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో డీజీపీ అంజనీ కుమార్ ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ని విచారణకు ఆదేశించడం తో ఆయన ఆదివారం రాత్రి సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.