Matrimony Fraud: ఆన్ లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నా జాగ్రత్త పడడం లేదు. అటు మ్యాట్రీమని రూపంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నా బాధితులు అప్రమత్తం కావడం లేదు. దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. సైబర్ నేరగాళ్ల బారినపడి నిలువునా మోసపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులు కూడా ఉండడం నివ్వెరపరుస్తోంది. తాజాగా విజయవాడలో ఇటువంటి మోసమే వెలుగుచూసింది. మ్యాట్రీమని ద్వారా పరిచయమైన యువకుడి బారినపడి ఓ కుటుంబం ఏకంగా కోటి రూపాయలకు పైగా సమర్పించుకుంది. ఇప్పుడు మోసపోయామని తెలిసి లబోదిబోమంటోంది. అమెరికా పేరు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిన సదరు యువకుడు మోసగాడని తెలంగాణ పోలీసులు చెప్పేదాక బాధిత కుటుంబసభ్యులు తెలుసుకోలేకపోయారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

మ్యాట్రీమని ద్వారా…
విజయవాడ దేవీనగర్ కు చెందిన యువతి ఎంటెక్ వరకూ చదువుకుంది. ప్రస్తుతం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. కుటుంబసభ్యులు ఆమెకు వివాహం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మ్యాట్రీమని లో ఆమె ప్రొఫైల్ ను ఉంచారు.ఈ ఏడాది ఏప్రిల్ 19న శ్రీకాంత్ అనే యువకుడు అప్రోచ్ అయ్యాడు. మీ ప్రొఫైల్ నచ్చిందని, వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్టు చెప్పాడు. తన కుటుంబసభ్యులు విశాఖలో ఉంటున్నారని నమ్మించాడు. తాను ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాని కూడా చెప్పాడు. ప్రస్తుతం తాను అమెరికా వెళుతున్నానని.. పెళ్లి తరువాత నీవు కూడా అమెరికాకు రావాల్సి ఉంటుందని సదరు యువతితో చెప్పాడు. అందుకు సంబంధించి పాస్ పోర్టు, వీసా తీసుకోవాలి.. అందుకు సిబిల్ స్కోర్ 842 పాయింట్లు ఉండాలని సూచించాడు.

ఆయనో చీటర్…
అయితే శ్రీకాంత్ మాటలను నమ్మిన సదరు యువతి కుటుంబసభ్యలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.కోటికి పైగా అప్పు చేశారు.సదరు యువతితో పాటు తండ్రి, సోదరులు కూడా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పుగా వచ్చిన మొత్తాన్ని శ్రీకాంత్ సూచన మేరకు అతడి స్నేహితుడు హరిష్ సంపంగి బ్యాంకు ఖాతాలో వేయమని చెప్పగా.. అలానే వేశారు. కానీ తరువాత శ్రీకాంత్ మాటలో మార్పు వచ్చింది. సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. ఫోన్ కు దొరకక ముఖం చాటేస్తున్నాడు. ఈనేపథ్యంలో సదరు యువతికి తెలంగాణ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి పెద్ద చీటర్ అని.. ఆయనతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దని సూచించారు. దీంతో యువతితో పాటు కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.