
Manjeera Pushkaralu 2023: పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏముంది ఒళ్లంతా కాలిపోతుంది.. ఈ సామెత ఎందుకు చెప్తున్నామంటే.. ఈ కథనం మొత్తం చదవండి. తర్వాత మీకే అర్థమవుతుంది.. అనగనగా గంగా నది.. మనదేశంలో 8.5% ప్రజలకు నివాసస్థలి.. 5000 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. పేరులోనే గంగ ఉంది కాబట్టి మన వాళ్ళు ఓన్ చేసుకొన్నారు. పవిత్రతకు మారుపేరని తీర్మానించుకున్నారు. నది అంటే విడిగా ఉండే ప్రవాహం కాదు కాబట్టి.. అనేక ఉపనదులను కలుపుకొని ప్రవహిస్తుంది కాబట్టి.. చివరిగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి.. గంగను ఉత్తుంగ తరంగ అని పిలుస్తుంటారు.. ప్రతీ నదికి ఉన్నట్టే గంగా నది కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు.. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతోంది.. దాని ప్రకారమే పుష్కరాలు వస్తున్నాయి. గంగానది పరివాహక ప్రాంతాల ప్రజలు పుష్కర స్నానాలు చేస్తున్నారు.
ఇదే విధానం గోదావరి నదికి కూడా వర్తిస్తుంది. ఉపనదులు కలుస్తున్నాయి కాబట్టి ప్రధాన నదికి ఒకసారి, ఉపనదులకు మరొకసారి పుష్కరాలు నిర్వహించరు. అలా నిర్వహిస్తే దాన్ని పుష్కరం అనరు. ఉదాహరణకి గోదావరి నదికి పుష్కరాలు నిర్వహించినప్పుడే.. దాని ఉపనది అయిన మంజీరా కి కూడా పుష్కరాలు చేస్తారు. అంతేకానీ గోదావరికి, మంజీరా నదికి వేరువేరుగా పుష్కరాలు చేయరు. కానీ ఇప్పుడు ఈ పుష్కర ప్రక్రియలోకి కూడా నీతి, రీతిలేని రాజకీయం ప్రవేశించింది. ఏదో పురాణం పేరు చెప్పేసి, ఉపనదికి, ప్రధాన నదికి పుష్కరాలు చేయమని చెప్పేసింది. దానికి ఒక పేరు పెట్టేసింది..ఇది డబ్బులు కొల్లగొట్టి, జనాల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం. దీనికి పుష్కరుడు అంగీకరించడు, అయినా ఎవడు దానిని వ్యతిరేకిస్తున్నాడు కనుక?.. అయినా అంగీకరించేందుకు పుష్కరుడు ఎవరు అని ఎదురు ప్రశ్న వేసే సెక్షన్ వచ్చేసింది. నిజానికి వారు చెప్పినట్టు నడుచుకోవడం తప్ప, ఇక్కడ పుష్కరుడికి మరో దారి లేదు..
వాస్తవానికి మంజీర అనేది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ప్రవహిస్తుంది. దీనికి ఒక్కో చోట ఒక్కో పేరు ఉంది..ఇది అంతర్రాష్ట్ర ఉప నది. సింపుల్ గా గోదావరిలో కలిసిపోతుంది..ఇప్పుడు గంగా నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మంజీర నదికి గరుడ గంగ పుష్కరాలు నిర్వహిస్తారట! అప్పుడప్పుడే 2011లో కేసీఆర్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఓ సెక్షన్ వాదిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేయాలి అన్న వ్యక్తి, పుష్కర విధివిధానాలు మార్చేయలేడా? 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం అది. కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్తే యావత్ పండితలోకం పాహి అని కిందపడి బొర్లి పోవడమే ఇక్కడ విడ్డూరం. ఇప్పుడసలే దేశ్ కీ నేత అని డప్పులు కొట్టించుకుంటున్నాడు కాబట్టి.. అవసరమైతే తనే ఒక పుష్కర స్వరూపుడు అని ఆ భారత రాష్ట్ర సమితి నాయకులు జేజేలు కొట్టినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఈ మంజీర పుష్కరాలు ప్రారంభమైన పెళ్లి రోజు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు చేశారట. ఇంకే మంది మంజీర పునీతం అయిపోయిందని ఒక సెక్షన్ చెప్పడం మొదలుపెట్టింది. చూశారా మా కెసిఆర్ పాలనలో పుష్కరాలకు నోచుకోని ఉపనది.. పుష్కర శోభ తో వెలిగిపోతోంది అని కీర్తించడం షురూ చేసింది. గతంలో కూడా ఇలాగే ప్రాణహిత అనే ఉపనదికి పుష్కరాలు చేశారు. కానీ ఇక్కడ గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడే మంజీరా ఉప నదిలో మూడు మునకలు వేయొచ్చు. కానీ ఈ మండే ఎండల్లో, వేళ కాని వేళల్లో పుష్కరాలు ఏమిటో చేస్తున్న వారికే తెలియాలి.
అన్నట్టు మెదక్ జిల్లా నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో పేరూరు శివారులో ఉన్న గరుడ గంగా సరస్వతి ఆలయ ఆదరణ కోసం ఈ ప్రయాస పడుతున్నారని తెలుస్తోంది. ఆ గుడిలో కొలువై ఉన్నది సరస్వతి మాత. అక్కడ భక్తులు నాగదేవతగా కొలుస్తారు. నది స్నానాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. ఆలయ సందర్శనాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఎక్కడో జరుగుతున్న గంగా పుష్కరాల పేరు చెప్పి.. ఇక్కడికి పుష్కరుడుని లాక్కొచ్చి 12 రోజులపాటు ఇక్కడ బంధించడం ఏమిటి? తెలంగాణలో ఉన్న పండితోత్తములకు ఇది పట్టదు. ఎందుకంటే కెసిఆర్ కు కోపం వస్తుంది కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? ఈ కథనం మొదట్లో పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుందో?!