
YCP Survey : ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అన్న సర్వే బీజేపీ ప్రాపకం కోసమా? కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకేనా? లేకుంటే ఏపీలో వెనుకబడిపోయామన్న అపవాదు నుంచి గట్టెక్కడానికా?పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల టైమ్స్ నౌ సర్వే పేరిట ఒకటి బయటకు వచ్చింది. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతాయన్నది సర్వే సారాంశం. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 24 లేదా 25 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. అయితే ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా? అంటే ఒక్క వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ తప్ప మరెవరూ ఒప్పుకోవడం లేదు. అటువంటప్పుడు సర్వే అంటూ ఎందుకు నివేదించారన్న ప్రశ్న అయితే మాత్రం ఉత్పన్నమవుతోంది. అయితే దీని వెనుక సదరు టైమ్స్ నౌ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి వెళుతున్న ఆయాచిత లబ్ధి ఒకటి కాగా… బీజేపీ తమ నుంచి దూరం కాకుండా ఉండేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలా సహకరించని కేంద్రం..
ఇటీవల కేంద్రం నుంచి జగన్ సర్కారుకు ఆశించిన స్థాయిలో సాయం లభించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాకున్నా రుణాలు, కేసుల విషయంలో ఇన్నాళ్లూ జగన్ కోరిందే తడువు.. ఢిల్లీ పెద్దలు సహకరించేవారన్న ప్రచారం ఉంది.అయితే ఇటీవల మాత్రం స్వరం మారింది. ఏపీలో ఇటీవల ప్రజలు ఓట్లేసిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. చివరికి జగన్ సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచాడు. అదే సమయంలో చాలా సర్వేల్లో వైసీపీ పూర్తిగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అటు నిఘా వర్గాల నుంచి కూడా అవే హెచ్చరికలు వస్తున్నాయి. అటు ఐ ప్యాక్ టీమ్ పన్నుతున్న పన్నాగాలు కూడా వృథా చర్యలుగా మిగిలిపోతున్నాయి. వీటన్నింటిపై కేంద్రానికి సమాచారముండడంతో ఢిల్లీ పెద్దలు అస్సలు పట్టించుకోవడం మానేశారన్న టాక్ వినిపిస్తోంది.

మారిన వైఖరికి కారణమదే..
అది ఏ రాష్ట్రమైనా బీజేపీ ఒకటే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓడిపోయే పార్టీతో అస్సలు సంబంధాలు నెరపదు. అందుకే ఈ విషయంలో వైసీపీకి మినహాయింపు ఇవ్వడం లేదు. ఓడిపోయే స్థానంలో ఉన్న వైసీపీ విషయంలో ఎందుకు చొరవ చూపించాలన్న ఉద్దేశంతో ఇటీవలి కాలంలో సహకారంపూర్తి స్థాయిలో తగ్గించేసిందన్న ప్రచారం జరుగుతోంది.దీంతో తమకు బలం తగ్గలేదని నిరూపించుకోవడం వైసీపీకి అనివార్యంగా మారింది. అందుకే ముందస్తు ఒప్పందం మేరకు టైమ్స్ నౌ సంస్థతో సర్వే పేరిట తాము బలంగా చెప్పించుకునే ప్రయత్నం చేసింది. ఎలాగైనా మళ్లీ బీజేపీతో పాత బంధం కొనసాగించి సాయం పొందాలని చూస్తోంది. అయితే సదరు మీడియా సంస్థ తన సొంతంగా సర్వేచేసి ఉంటే దానికి ఒక విలువ ఉండేది. కానీ వైసీపీ సర్కారు ప్రకటనల రూపంలో ఇస్తున్న సాయానికే సదరు సంస్థ అనుకూల సర్వే ఇచ్చిందన్న ప్రచారం ఊపందుకుంది.
విశ్వసించడం లేదు..
సాధారణంగా సర్వే సంస్థలు పూర్తి వివరాలతో వెల్లడిస్తాయి. కానీ టైమ్స్ నౌ విషయంలో అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. ఎలాంటి ప్రతిపదిక కనిపించలేదు. ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో స్పష్టత లేదు. అది ఫోన్ సర్వేనా లేకపోతే క్షేత్రస్థాయిలో తిరిగి అభిప్రాయాలు సేకరించారా? అన్నది కూడా తెలియదు. అందుకే ఈ సర్వేను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతెందుకు వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా విశ్వశించడం లేదు. అయితే వైసీపీ హర్ట్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ తెలియక చాలా భ్రమల్లో బతుకుతున్నారు. అటు కేంద్ర పెద్దలు సైతం దీనిని ఒక ఫేక్ సర్వేగా నిర్థారించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ ప్రయత్నం ఎండమావిగానే మిగలనుంది.