Manchu Laxmi : మంచు లక్ష్మీ చేసిన పనికి రెండు చేతులు ఎత్తి మొక్కాల్సిందే

భవిష్యత్ లో టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ సేవలను మరింత విస్తృతపరుస్తామని లక్ష్మీ పేర్కొన్నారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ సర్కారుకు ఆమె అభినందనలు తెలిపారు.

Written By: Dharma, Updated On : June 29, 2023 5:43 pm
Follow us on

Manchu Laxmi : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న ఉదారతను చాటుకున్నారు. నటి, స్వచ్ఛంద సేవకురాలిగా ఉన్న ఆమె తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీలో సైతం వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. కంప్యూటర్ విద్యతో పాటు ఇతర మౌలిక వసతులు సమకూర్చారు.

తొలుత తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. అక్కడ కంప్యూటర్ ల్యాబులతో పాటు ఇతరత్రా వసతులను సమకూర్చారు. వాటిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతూ వస్తోంది. అందుకే ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ కు లక్ష్మీప్రసన్న వచ్చారు. కలెక్టర్ క్రాంతితో భేటీ అయ్యారు. పాఠశాలల దత్తతకు తన సమ్మతిని తెలిపారు. ఒప్పందపత్రాలపై సంతకం చేశారు. లక్ష్మీప్రసన్న మాదిరిగి సినీ సెలబ్రెటీలు పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని కలెక్టర్ క్రాంతి కోరారు.

విద్యాసంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా దత్తత తీసుకున్న పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని లక్ష్మీప్రసన్న తెలిపారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఆగస్టు నాటికి పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలన్నదే తమ అభిమతమన్నారు. భవిష్యత్ లో టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ సేవలను మరింత విస్తృతపరుస్తామని లక్ష్మీ పేర్కొన్నారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ సర్కారుకు ఆమె అభినందనలు తెలిపారు.