YCP : వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిలకడగా నిల్చోలేరు. కుదురుగా కూర్చోలేరు. ఒకరకంగా చెప్పాలంటే టార్చర్ పడుతున్నారు. హైకమాండ్ చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. పోనీ సాహసించి వెళితే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. పోనీ వారి నుంచి ఎలాగైనా తప్పించుకుందామంటే సోషల్ మీడియా వదలడం లేదు. క్షాణాల్లో ప్రశ్నలు, నిలదీతలు వైరల్ అయిపోతున్నాయి. ఎందుకొచ్చింది గొడవ జనాల మధ్యకు వెళ్లకపోతే మంచిదనుకుంటే హైకమాండ్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతోంది. ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికలతో వెనుకబడిన జాబితాలో పేర్లు చేరిపోతున్నాయి. అందుకే వైసీపీ ప్రజాప్రతినిధులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారిపోయింది.
ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఒక చిక్కొచ్చిపడింది. మీడియా ముందు, సభల్లో ఎన్నయినా మాట్లాడొచ్చు.. కానీ జనాల ముందుకు వెళ్లేసరికి హోదాలన్నీ మరిచిపోవాలి. వారితో మమేకమై మాట్లాడాలి. కానీ ఆయన అదే దర్పం ప్రదర్శించారు. ఏకంగా ఓ మహిళ ప్రశ్నించేసరికి తట్టుకులేకపోయారు. ఏం చేసుకుంటావో చేసుకో అని చిరాకుగా సమాధానం చెప్పారు.ఎవరితో ఎందుకు చెబుతాను.. సీఎంకే ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నీ.. జీవితం అంటూ స్పీకర్ నిట్టూరుస్తూ అక్కడ నుంచి జారుకున్నారు. స్పీకర్ లాంటి సీనియర్ నే ప్రజలు ప్రశ్నలతో ఆటాడుకుంటే మరీ మిగతా వారి విషయంలో ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
నేను బటన్ నొక్కుతున్నాను.. మీరు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి అంటూ సీఎం జగన్ పురమాయిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. ఉత్తనే ఇస్తున్నారా? మా సొమ్మే కదా? పన్నుల రూపంలో తీసుకుంటున్నదే కదా? అని ముఖం మీదే చెబుతున్నారు. పోనీ లబ్ధిదారుల జాబితాలతో వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు సాయంతో వెళుతుంటే అభివృద్ధి పనులేవని అడుగుతున్నారు. పథకాలు ఎవరైనా ఇస్తారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కావాలని అడుగుతున్నారు. మరికొందరైతే ముఖం మీదే తలుపులు వేస్తున్నారు. ఇంత బతుకు బతికి ఇదేంటి జీవితం అంటూ నిట్టూర్చడం వైసీపీ ప్రజాప్రతినిధుల వంతవుతోంది.
ప్రజలు నిలదీయకూడదని చాలారకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే రిహార్సల్స్ చేసి చూపిస్తున్నారు. అయితే తామొకటి తలస్తే.. అన్నట్టు ఒక్కసారిగా జనాలు సౌండ్ చేస్తున్నారు. చిక్కారు కదా అని ప్రజాప్రతినిధులను చుక్కలు చూపిస్తున్నారు. దీనికి లోకల్ పాలిటిక్స్.. పక్కింటి వారికి పథకాలు వచ్చి తమకు రాకపోవడం వంటివి తోడవుతున్నాయి. పోనీ ఊర్లో వైసీపీ ప్రజాప్రతినిధులను టచ్ చేసి వెళ్లిపోదామంటే ఐ ప్యాక్ వాచ్ చేస్తుందన్న భయం వెంటాడుతోంది. ఇలా ఎలా చూసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు టార్చరే మిగులుతోంది.