Bull Cart Ride To Delhi: అత్తింటి వేధింపులకు గురైన తోబుట్టువుకు న్యాయం చేయాలని గ్రామపెద్దల కాళ్లావేల్లా పడ్డాడు. భర్తను దగ్గర చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ఫలితం లేకపోగా తిరిగి పరువు నష్టం దావాను ఎదుర్కోవడంతో పాటు అతడిపైనే కేసులు నమోదయ్యాయి. పోలీసుల చర్యలకు విసిగివేశారిపోయిన ఆయన తన తల్లితో కలిసి ఢిల్లీకి ఎడ్ల బండి యాత్రకు సిద్ధమయ్యాడు. సుప్రిం కోర్టుతో పాటు మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని భావించాడు. అయితే ఎడ్ల బండి యాత్ర గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో స్పందించిన మాన వహక్కల కమిషన్ ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులిచ్చింది. దీంతో పోలీసులు, అధికారులు స్పందించి బాధితుడి ఎడ్ల బండి యాత్రను నిలిపివేయించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లెలు నవ్యతకు 2018లో చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌తో పెళ్లి జరిగింది. రూ.23లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత భర్త నరేంద్రనాధ్ తనతో సక్రమంగా ఉండటం లేదని భార్య నవ్యత తన ఆడపడుచుకు తెలిపింది. ఈ విషయం బయటకు చెప్పొద్దని, పరువు పోతుందని ఆడపడుచు నచ్చచెప్పింది. ఆతర్వాత ఆడపడుచు జర్మనీ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు.
Also Read: Bindu Madhavi: ‘బిందుమాధవి’కి మరో రెండు భారీ ఆఫర్స్.. ఆ సినిమా కూడా !
ఈ సంఘటనలపై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ గా, కేసు నమోదు చేశారు. అయినా కేసులో పురోగతి లేకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ కొద్ది రోజుల కిందట నవ్యత కృష్ణా నదిలో ఇసుక తిన్నెలపై నిరసన దీక్ష చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తమకు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేనందున, సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసేందుకు నవ్యత సోదరుడు దుర్గారావు తల్లి జ్యోతితో కలిసి ఎడ్లబండిపై ఈ నెల 23న న్యూఢిల్లీ యాత్ర చేపట్టారు. ఎడ్లబండి యా త్రపై మీడియాతో కథనాలు రావటంతోపాటు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు డోర్నకల్ సమీపంలో దుర్గారావును కలిశారు. న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పి దుర్గారావును, ఆయన తల్లి జ్యోతిని గ్రామానికి తీసుకువచ్చారు.
అధికారులు, పోలీసుల స్పందనకు మానవ హక్కుల కమిషన్ నోటీసులే కారణం. దుర్గారావు ఎడ్లబండి యాత్రపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో కథనాలను సుమోటోగా తీసుకుంది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నోటీసు అందిన 48 గంటల్లో తెలపాలంటూ కమిషన్ గౌరవ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్) జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.అందుకే అధికారులు అదరాబాదరగా వరంగల్ వెళ్లి దుర్గారావును ఒప్పించి ఎడ్ల బండి యాత్రను నిలిపివేయించారు. తన చెల్లికి న్యాయం చేయాలని, కట్నకానుకలు తిరిగివ్వాలని, తమపై వేసిన పరువు నష్టం కేసు, ఇతర కేసులు వెనక్కి తీసుకోవాలని దుర్గారావు డిమాండ్ చేశారు. తన చెల్లికి న్యాయం జరగని పక్షంలో తిరిగి యాత్ర చేస్తానని దుర్గారావు చెప్పారు.
Also Read:YSR Congress Party: రూపాయి ఖర్చు లేకుండా వైసీపీ పార్టీని ఎలా నడుపుతోంది?