Uttar Pradesh: దరఖాస్తు చేసుకున్న 28 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తికి ఉద్యోగం దక్కింది. మూడు దశాబ్దాల పోరాటానికి ఉపశమనం లభించింది. 50 ఏళ్ల వయసులో ఆ వ్యక్తికి ఉద్యోగం వరించింది. ఈ 28 ఏళ్ల పాటు ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. తొలుత ఉద్యోగానికి ఎంపిక చేశారు. తరువాత అనర్హుడని ప్రకటించి తొలగించారు.చివరికి న్యాయపోరాటంలో ఆయన ఊరట దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన ఇది.
ఉత్తరప్రదేశ్ లకింపూర్ ఖేరీ పోస్టల్ డివిజన్లో పది పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపికైనా.. ఉద్యోగంలో చేరేందుకు మాత్రం ఆయన మూడు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో 50 ఏళ్ల వయసులో ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. ఉద్యోగ నియామక ప్రక్రియలో అంకూర్ గుప్తాను అనర్హుడిగా ప్రకటించడంలో పోస్టల్ డిపార్ట్మెంట్ తప్పు ఉందని సుప్రీంకోర్టు విచారణలో తేలింది. అతడిని వెంటనే పోస్టల్ అసిస్టెంట్ గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
1995లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ నిర్వహించింది. అంకుర్ గుప్తాతో పాటు మెరిట్ జాబితాలో ఉన్న వారిని గుర్తించి 15 రోజులు పాటు శిక్షణ కూడా ఇప్పించారు. అయితే ఉన్నతాధికారులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయగా అంకుర్ గుప్తా ఇంటర్ ఒకేషనల్ చదవడంతో ఉద్యోగానికి అనర్హుడుగా ప్రకటించారు. దీంతో అప్పటినుంచి అంకూర్ న్యాయపోరాటం చేస్తున్నాడు. 1996లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను 2000లో హైకోర్టులో తపాలా శాఖ సవాల్ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు సమర్పించింది. 2017లో పోస్టల్ డిపార్ట్మెంట్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతోఆ ఆదేశాలపై 2021లో రివ్యూ పిటిషన్ వేసినా.. వాటిని కూడా హైకోర్టు తిరస్కరించింది. దీంతో చివరకు తపాలా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్యోగాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ సమయంలో ఇంటర్ ఒకేషనల్ విద్యార్హత అనర్హమని చెప్పలేని దృష్ట్యా.. అంకూర్ గుప్తాకు ఉద్యోగం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 28 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆయనకు ఉద్యోగం దక్కింది. మరో నెల రోజుల్లో ఆయన ఉద్యోగంలో చేరనున్నారు. అయితే అంకూర్ వయసు 50 సంవత్సరాలు. పదవీ విరమణకు మరో పదేళ్ళే ఉంది. మొత్తానికైతే ప్రభుత్వ కొలువు సాధించాలన్న అంకూర్ ప్రయత్నం ఎట్టకేలకు తీరింది.