Malla Reddy: తెలంగాణ రాజకీయాలలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ.. కొందరు మాత్రమే ఫేమస్ కావడానికి ప్రధాన కారణం వారి మాట తీరు. అలా ఫేమస్ అయిన వారిలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒకరు. మల్లారెడ్డి ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా విద్యావేత్తగా కూడా గుర్తింపు పొందారు. హైదరాబాదులో ఆయనకు పదులకొద్దీ విద్యాసంస్థలు ఉన్నాయి. నర్సరీ నుంచి మొదలు పెడితే మెడిసిన్ వరకు ఆయన విద్యాలయాలను స్థాపించారు. విద్యావ్యతగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మల్లారెడ్డి.. సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో ఫేమస్ అయ్యారు. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కష్టపడ్డ. వ్యాపారం చేసిన అనే మాటలతో ఆయన ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఇక భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. అసెంబ్లీలో తనదైన శైలిలో మాట్లాడుతూ నవ్వులు పూయించేవారు. సరదా వ్యాఖ్యలతో నవ్వులు తెప్పించేవారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో న్యూస్ చానల్స్ కూడా మల్లారెడ్డి తో ఇంటర్వ్యూలు నిర్వహించేవి. ఇక ఇటీవల రాబిన్ హుడ్ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో హీరో నితిన్ తో కలిసి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
నోరు అదుపు తప్పింది
సరదా వ్యాఖ్యలతో మల్లారెడ్డి వార్తల్లో నిలుస్తారు . తెలంగాణ మాండలికంతో తన భాషకు మరింత అలంకారాన్ని తీసుకొస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మల్లారెడ్డి మీడియా ప్రతినిధులపై ఎదురు దాడికి కూడా దిగుతారు. అయితే అవి కూడా కాస్త సరదాగానే ఉంటాయి. అప్పుడప్పుడు మల్లారెడ్డి డాన్సులు కూడా చేస్తారు. ఇటీవల హోలీ వేడుకల్లో మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే అటువంటి మల్లారెడ్డి ఈసారి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ” ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ పేరు కసి కపూర్. చూసేందుకు ఆమె కసి కసిగా ఉంది. ఈ సినిమాలో హీరో మా కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ కొడుకు. అందువల్లే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చానని” మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ” మీ వయసు ఏంటి.. మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి.. ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా.. ఇష్టానుసారంగా మాట్లాడతారా.. హీరోయిన్ పేరు కసి కపూర్ అయితే.. ఆమె మీకు కసి కసిగా కనిపిస్తోందా.. కళ్ళకు ఏమైనా చత్వారం వచ్చిందా.. బుద్ధి ఉండక్కర్లేదా.. మేడ్చల్ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ప్రిన్సిపాల్ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమా ప్రమోషన్ కోసం అసెంబ్లీకి డుమ్మా కొడతారా.. మీరు బాధ్యతగల ప్రజా ప్రతినిధి.. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram