Makes Money By Selling Air: ఉపాయమున్నోడు ఉపాసముండడు అనేది సామెత. అవకాశాలు లేవని ఎందరో తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. అవకాశాలుండవు వాటిని మనమే సృష్టించుకోవాలి. మన అదృష్టాన్ని మార్చేది మన చేతిలోని గీతలు కాదు చేతలే అని గుర్తుంచుకోవాలి. కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా ఎదగడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే ఒళ్లు వంచాలి. కష్టపడి పనిచేయాలి. తరువాత నీకు గుర్తింపు అదే వస్తుంది. దానికి తొందర పడాల్సిన పనిలేదు. నీ పనిని నువ్వు అంకితభావంతో చేస్తే ఎప్పటికైనా భవిష్యత్ ఉండటం ఖాయమే.

ఇక్కడో విచిత్రమైన పద్ధతిలో గాలిని అమ్ముతున్నాడు. గాలి ఉచితంగానే దొరుకుతుంది కదా దాన్ని అమ్మడమేమిటి అనేదే కదా మీ అనుమానం. కానీ తెలివి ఉంటే అన్ని సాధ్యమే. అతడు తన తెలివితేటలు ఉపయోగించి గాలిని అమ్మడంతో అందరు అవాక్కవుతున్నారు. ప్రకృతిలో కావాల్సినంత విధంగా లభించే గాలిని అమ్మడంలోనే అతడి నైజం బయటపడుతోంది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు అమ్మేవాడికి కొనేవాడు కూడా లోకువే అని తెలిసిపోతోంది. దీంతో అతడి ఆలోచనకు అందరు బ్రహ్మరథం పడుతున్నారు.
తెలివి ఉండాలే కాని ఎడారిలో కూడా బతికేయొచ్చు. మనసుంటే మార్గముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమైపోతోంది. అందుకే అతడికో వినూత్న ఆలోచన తట్టింది. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని గాలితో వ్యాపారం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా కార్యరూపం చేసేందుకు ప్రయత్నించాడు. గాలిని బాటిళ్లలో నింపి అమ్మాలని తలచాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. గాలితో నాలుగు రాళ్లు సంపాదించుకునే వ్యక్తిని చూడటం కూడా ఇదే తొలిసారి. దీంతో గాలితో వ్యాపారం చేసిన వాడిగా రికార్డులకెక్కాడు.

కొలంబియాలోని మెడెలిన్ కు చెందిన జూవాన్ కార్లోస్ అల్యరాడో ఈ వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. నాణ్యమైన గాలిని ఆస్వాదించేవారికి దాన్ని అందించడంపై దృష్టి నిలిపాడు. గాలిని నింపిన బాటిళ్లను టూరిస్టులకు విక్రయిస్తున్నాడు. మెడలిన్ ఎయిర్ అనే పేరుతో ఈ బాటిళ్లను అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. చెట్టు పేరు కాలమ్మడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. గాలిని అమ్మడమేమిటని అందరు చీప్ గా చూసినా ఇప్పుడు వారే నోరెళ్లబెడుతున్నారు. అతడు చేసే వ్యాపారానికి ఆశ్చర్యపోతున్నారు.
మెడలిన్ ప్రాంతంలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కో బాటిల్ ధర రూ. 5 డాలర్లు (మన కరెన్సీలో రూ.400). మొదట్లో కాస్త తటపటాయించినా ఇప్పుడు వ్యాపారం కుదురుకుంది. రోజుకు వందల్లో బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. ఒక్కో బాటిల్ లో గాలిని శుద్ధి చేసి నింపేందుకు పావు గంట నుంచి అరగంట పడుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారు చేసుకుని తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. గాలితో కూడా వ్యాపారం చేయడంతో అందరు వింతగా చూస్తున్నారు.