
Maheshwar Reddy: తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న కాంగ్రెస్‌కు స్వపక్షంలోనే విపక్షం తయారైంది. మరోవైపు అధికారా పార్టీ కూడా బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక వచ్చే ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్సే అని ఆ పార్టీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కానీ పార్టీలోని కొంతమంది తీరుతో ఎగుదల అటుంది.. పాతాళంలోకి పడిపోతోంది. మరోవైపు పార్టీ పరిస్థితిని చూసి ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేకు పంపినట్లు తెలిపారు.
కమలం గూటికి..
రాజీనామా అనంతరం మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ మేరకు తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా కండువాను కప్పి.. తరుణ్ ఛుగ్, బండి సంజయ్ మహేశ్వర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్వర్‌రెడ్డి కూడా తరుణ్ ఛుగ్‌కు శాలువాను కప్పి సత్కరించారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా నడ్డా నివాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి మహేశ్వర్‌రెడ్డిని నడ్డా ఆహ్వానించారు.

పీసీసీ చీఫ్ తీరుపై అసంతృప్తితో..
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే మహేశ్వర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను ఆ పార్టీ అధిష్టానం ఇటీవల అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు మహేశ్వర్‌రెడ్డి. మరోవైపు, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేశ్వర్‌రెడ్డి చెప్పగడం గమనార్హం. తాజాగా, బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అసంతృప్తులు కూడా బీజేఈవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.