Madhya Pradesh : అటవీ శాఖ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ అటవీ ప్రాంతంలో ఒక పులి చనిపోయింది. పులి చనిపోవడం అనుమానాస్పదంగా ఉండడంతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంతే అనుమానం వచ్చిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.తమ సతీమణులను వశం చేసుకోవడానికి .. చెప్పినట్టుగా వినడానికి కొంతమంది క్షుద్ర పూజలు చేశారు. తాంత్రిక విధానాలు అవలంబించారు. అంతేకాదు వాటితో పాటు పులి చర్మం, దాని గోర్లు అవసరమని మంత్రగాడు చెప్పాడు. దీంతో అతడు చెప్పినట్టుగానే ఇద్దరు వ్యక్తులు చేశారు.
Also Read : బీఆర్‌ఎస్‌లో సంక్షోభం… కేసీఆర్ కామ్.. వ్యూహమా.. వ్యూహాత్మకమా!?
గత నెల 26న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇటీవల పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు చూశారు. అయితే ఆ పులిపై క్రూరమైన దాడి జరిగినట్టు గుర్తించారు. అయితే ఆ పులి చర్మం కొంత భాగం కోతకు గురైంది. పైగా తనని ముక్కలుగా నరికినట్టు కనిపించింది. గోళ్లు పీకి వేసినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కడ దృశ్యాలు చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఆ తర్వాత ఫోరెన్సి క్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఆ పులి చనిపోయిన తీరు సహజమైనది కాదని.. దానిని దాడి చేసి చంపారని గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని అటవీశాఖ అధికారులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాన్ని అంగీకరించారు..” మా భార్యలను వశం చేసుకోవాలని అనుకున్నాం. అదుపులో పెట్టాలని అనుకున్నాం. అందువల్లే క్షుద్ర పూజలు చేశాం. చేతబడి కూడా నిర్వహించామని” ఆ వ్యక్తులు అంగీకరించారు.
అయితే పులి గోర్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయట. వైవాహిక సంబంధాలలో సమూల మార్పులు తీసుకురావడానికి అవి దోహదం చేస్తాయట. ఇదే విషయాలను మాంత్రికుడు ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్పాడు. దీంతో రాజకుమార్, ఝామ్ సింగ్ అనే నిందితులు మంత్రగాడి మాటలను పూర్తిస్థాయిలో నమ్మారు. పులి గోర్ల ద్వారా తాంత్రిక పూజలు నిర్వహిస్తే తమ భార్యలు చెప్పినట్టుగా వింటారని.. లోబడి ఉంటారని.. అణిగిమణిగి ఉంటారని అనుకున్నారు.. మంత్రిగాడు చెప్పినట్టుగా పులి గోర్ల కోసం ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి ఒక పులి కదలికలు గమనించి.. దానిని హతం చేశారు. అయితే వారు పులిని చంపుతుండగా ఓ వ్యక్తి దూరం నుంచి చూసాడు. అదే విషయాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పాడు. చెప్పిన వివరాలు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం వారిపై అనుమానం వ్యక్తం చేసింది.. నిందితుల నుంచి పులి చర్మం, పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. పులి చర్మాన్ని, గోర్లను సేకరించే క్రమంలో ముక్కలుగా దాని దేహాన్ని నరికారు. అయితే ముందుగా గోర్లను మాత్రమే ఆ నిందితులు తీసుకెళ్లారు. ఆ తర్వాత మాంత్రికుడు చర్మం కావాలి అని అడగడంతో.. మళ్లీ వచ్చి దాని దేహాన్ని కత్తులతో కోసి చర్మంలో కొంత భాగాన్ని తీసుకొని వెళ్లారు. అయితే ఈ నిందితులు గతంలో చిరుత పులి, పులులను కూడా వేటాడారు. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు.. అయితే వీరికి పులి చర్మం, గోర్లు తీసుకురావాలని చెప్పిన మాంత్రికుడు జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం.. జైలుకు తరలించారు. నేటి ఆధునిక కాలంలో.. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఏంటని.. పులి చర్మం, గోర్లతో పూజలు చేస్తే భార్యలు వశం కావడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.