Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి చేద్దామనుకున్న అంతరిక్ష యాత్ర రద్దయింది. చివరి నిమిషంలో ఆ మిషన్ వాయిదా పడింది. మరో వ్యోమగామి తో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ రాకెట్ లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆ మిషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.
అడుగడుగునా అడ్డంకులు
తొలి మానవ సహిత స్టార్ లైనర్ మిషన్ ను బోయింగ్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, ఈ మిషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి.. దీంతో రాకెట్ లాంచింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఇన్ని అవరోధాలు తర్వాత ఇక మిషన్ లాంచ్ కు సిద్ధమైన తరుణంలో.. సునీతా విలియమ్స్ వెళ్లే మూడవ స్పేస్ మిషన్ ఒక్కసారిగా రద్దయింది. సునీతా విలియమ్స్, మరో వ్యోమగామిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే “అట్లాస్ వీ రాకెట్” పై భాగంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రాకెట్ లాంచ్ కు కొన్ని గంటల ముందు కౌంట్ డౌన్ నిలిపేశారు.
మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..
ఆ రాకెట్ పై ఉన్న “అట్లాస్ వీ” ను బోయింగ్ లోక్ హీడ్ మార్టిన్ జాయింట్ వెంచర్ సంస్థలో కంపెనీగా ఉన్న యునైటెడ్ లాంచ్ అలయన్స్ రూపొందించింది. దీని ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత కాప్సూల్ లోని సిబ్బందిని.. కింది నుంచి మాన్యువల్ గా ఆపరేట్ చేస్తారు. టార్గెట్ ఆపరేషన్ శక్తి సామర్థ్యాలను లెక్కిస్తారు. ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన నేపథ్యంలో.. మరోసారి ఎప్పుడు ప్రయోగిస్తారనే విషయాన్ని బోయింగ్ ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 10 లేదా 11 తేదీలలో ఈ ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది.
ఎన్నో సంవత్సరాలుగా..
మానవ సహిత రాకెట్ లాంచ్ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్ కంపెనీ వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.. ఈ ప్రయోగం కోసం భారత మూలాలు ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను ఎంపిక చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా వారిద్దరూ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి వెళ్లి, తిరిగి రావాల్సి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మే 7వ తేదీ, మంగళవారం ఉదయం 8:4 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనవెరాల్ నుంచి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌక బయలు దేరాల్సి ఉంది. సునీతా విలియమ్స్, బుచ్ తమ సీట్లో కూర్చొని లిఫ్ట్ ఆఫ్ కు సిద్ధమయ్యారు. కానీ ఆనివార్య పరిస్థితుల్లో ఆ మిషన్ రద్దయింది..
నాసా చీఫ్ ఏమన్నారంటే..
” ఈరోజు నిర్వహించాలనుకున్న లాంచ్ నిలిపివేస్తున్నాం. మేము భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అందువల్లే అంత సిద్ధంగా ఉన్నప్పుడే ప్రయోగాన్ని మళ్లీ మొదలుపెడతామని” నాసా చీఫ్ బిల్ నెల్సన్ పేర్కొన్నారు. మరోవైపు భద్రత విషయంలో బోయింగ్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది.. ప్రస్తుతం స్టార్ లైనర్ లాంచ్ తాత్కాలికంగా రద్దు కావడం.. కమర్షియల్ ఏవియేషన్ విభాగం పై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.