Prajwal Revanna: దక్షిణాది రాష్ట్రాలలో 50 సీట్లు దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా భావించింది. కర్ణాటక మినహా మిగతా ఏ రాష్ట్రాలలో కూడా ఆ పార్టీకి రెండంకెల స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదు. దీంతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రాన్ని బలంగా నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. 2019 లాగానే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మ్యాజిక్ ప్రదర్శించవచ్చని భావించింది. భారతీయ జనతా పార్టీ ఒకరకంగా భావిస్తే.. జరిగింది వేరు. హసన్ పార్లమెంట్ సభ్యుడు, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ అంశం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంది. వాస్తవానికి ఈ వ్యవహారం ఎప్పుడో తెలిసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దక్షిణ కర్ణాటకలో పోలింగ్ పూర్తయిన తర్వాత బయట పెట్టింది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. మిగిలిన స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఈ స్థానాలలో జెడిఎస్ పోటీలో లేదు. అయినప్పటికీ ఆ ప్రభావం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపై తప్పక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జెడిఎస్ పోటీచేసిన మూడు సీట్లకు గత నెలలో పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం పోలింగ్ జరుగుతున్న రెండవ దశ స్థానాలలో ఎక్కువ శాతం ఉత్తర, సెంట్రల్ కర్ణాటకలోని అత్యంత ప్రభావంతమైన లింగాయత్ సామాజిక వర్గం ప్రాబల్యంలోనివే.
ఎన్నికలు జరుగుతున్న 14 స్థానాలలో కిట్టూర్ కర్ణాటక ప్రాంతంలో 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి గట్టిపట్టు ఉంది. వెనుకబడిన ప్రాంతానికి చెందిన కళ్యాణ్ కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ఈ ప్రాంతంపై పట్టు పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజ్వల్ రాసలీలల వ్యవహారం తెరపైకి రావడంతో భారతీయ జనతా పార్టీ నష్ట నివారణ చర్యలకు పాల్పడింది. ప్రజ్వల్ వ్యవహారాన్ని తప్పు పట్టింది. అయితే భారతీయ జనతా పార్టీని తెలివిగా దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఉదంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు గానీ.. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజెపి, జెడిఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేశారు. కానీ ఎప్పుడైతే ప్రజ్వల్ వ్యవహారం తెరపైకి వచ్చిందో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రజ్వల్ ఉదంతం వల్ల ఆయన తండ్రిని.. కుమారస్వామి పూర్తిగా పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చీలిక ఏర్పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలలో 15 మంది తమతో టచ్ లో ఉన్నారని కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం బి పాటిల్ వ్యాఖ్యానించారు.
ఇక రెండో విడత ఎన్నికలు జరుగుతున్న 14 పార్లమెంట్ స్థానాలను 2019లో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ తమకు అనుకూలంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. ముందుగానే చెప్పినట్టు కర్ణాటక రాష్ట్రంలో బలమైన సీట్లు గెలుచుకోవాలని ఉద్దేశంతో.. ఈ 14 పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మార్చింది.. కొప్పల్, ఉత్తర కన్నడ, మరికొన్ని నియోజకవర్గాలలో పాత అభ్యర్థులకు మొండిచేయి చూపింది. ఇక ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన మంత్రుల కుమారులు లేదా కుమార్తెలను రంగంలోకి దింపడం విశేషం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన వారిలో ఒక్కరు తప్ప మిగతా వారంతా కొత్తవాళ్లే. మంగళవారం చిక్కోడి, బెలగావి, బాల్కోటే, ఉత్తర కన్నడ, బీదర్, రాయచూర్, బళ్లారి, కొప్పల, విజయపుర, కలబురిగి, దావణ గెరె, శివమొగ్గ, హావేరి, ధారవాడ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది.