Homeఅంతర్జాతీయంBotswana Diamond: బోట్స్‌వానాలో అద్భుతం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది గుర్తింపు

Botswana Diamond: బోట్స్‌వానాలో అద్భుతం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది గుర్తింపు

Botswana Diamond: వజ్రాలు ప్రపం వ్యాప్తంగా వందల రకాలు ఉన్నాయి. వాటి బరువు, రంగు ఆధారంగా విలువను నిర్ధారిస్తారు. ఇక ఒకప్పుడు వజ్రం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడ ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా వజ్రాన్ని కొనుగోలు చేస్తున్నారు. బంగారాన్ని గ్రాముల్లో కొలిస్తే.. వజ్రాన్ని క్యారెట్లలో కొలుస్తారు. గ్రాము వజ్రం భారత కరెన్సీలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటుంది. అందుకే మధ్యతరగతి ప్రజలు వజ్రం కన్నా బంగార కొనుగోలుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక మన దేశం కూడా వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలకు నిలయమని అంటారు. అయితే గతంలో భారతదేశంపై దండయాత్ర చేసిన ముస్లిం రాజులు, తర్వాత వచ్చిన బ్రిటిష్‌ పాలకులు మన దేశంలోని విలువైన ఖనిజాలు, ఆభరణాలను అపహరించుకుపోయారని చరిత్ర చెబుతుంది. మన దేశంలో అత్యంత విలువైన వజ్రంగా కోహినూర్‌ను భావిస్తారు. అయితే ప్రపంచంలో అంతకన్నా విలువైన ఖనిజం దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద వజ్రం. రెండో అతిపెద్ద వజ్రాన్ని ఇప్పుడు బోట్స్‌వానాలో గుర్తించారు. ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన బోట్స్‌వానాలో లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ఈ వజ్రాన్ని వెలికితీసింది. ఇప్పటివరకు ప్రపంచంలో దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది రెండోది అని అధికారులు వెల్లడించారు. ఇటీవల బయటపడిన అతి పెద్ద వజ్రాలు ఈ బోట్స్‌వానా దేశంలోనే అధికంగా దొరకడం గమనార్హం. అయితే ఈ వజ్రం విలువ ఎంత ఉంటుంది.. దాని నాణ్యత ఎంత అనే విషయాలను మాత్రం లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ వెల్లడించలేదు.

2492 క్యారెట్లు..
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా వెలికితీయగా దాని బరువు 2492 క్యారెట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బోట్స్‌వానాలోని కరోవే గనిలో ఈ వజ్రాన్ని.. కెనడాకు చెందిన లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ గుర్తించింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్‌–రే డిటేక్షన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వజ్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అతి పెద్ద 2492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ఎంతో సంతోషంగా ఉందని లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు విలియం లాంబ్‌ పేర్కొన్నారు.

1905 అతిపెద్ద వజ్రం..
1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3106 క్యారెట్ల కల్లినల్‌ వజ్రమే ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంగా నిలిచింది. తాజాగా బోట్స్‌వానాలో లభించిన ఈ వజ్రం.. రెండో అతిపెద్దదిగా నిలిచినట్లు లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఈ కల్లినల్‌ వజ్రాన్ని 9 ముక్కలు చేశారని.. వీటిలో కొన్ని జెమ్స్‌ బ్రిటిష్‌ క్రౌన్‌ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే… ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌వానా ఒకటి. ఇటీవల వెలికి తీసిన ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాలు.. బోట్స్‌వానాలోనే బయటపడ్డాయి. కరోవే గనిలో 2019లో దొరికిన 1758 క్యారెట్ల సెవెలో వజ్రం ఇప్పటి వరకు రెండో అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉండేది. ఈ సెవెలో వజ్రాన్ని ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌస్‌ లూయిస్‌ వుయిట్టన్‌ కొనుగోలు చేసింది. తాజాగా బయటపడిన వజ్రం ఆ రికార్డును అధిగమించింది.

వజ్రాల ఉత్పత్తిలో 20 శాతం వాటా..
ఇక రెండో అతిపెద్ద వజ్రం దొరికిన విషయాన్ని బోట్స్‌వానా ప్రభుత్వం కూడా నిర్ధారించింది. బోట్స్‌వానా రాజధానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోవీ గనిలో ఈ 2492 క్యారెట్ల వజ్రం దొరికిందని, తమ దేశంలో ఇప్పటివరకు దొరికిన వజ్రాల్లో ఇదే అతి పెద్దదని ప్రకటించింది. ఇక ప్రపంచ వజ్రాల ఉత్పత్తిలో బోట్స్‌వానాది 20 శాతం వాటా ఉంది. ఎక్స్‌–రే డిటేక్షన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ వజ్రాన్ని గుర్తించినట్లు లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ తెలిపింది. 2017 నుంచి ఈ టెక్నాలజీని వాడుతున్నామని.. ఈ టెక్నాలజీ వల్ల వజ్రాలను గుర్తించడంతోపాటు వాటిని విరిగిపోకుండా వెలికితీయవచ్చని పేర్కొంది. 2016 లో బోట్స్‌వానాలో దొరికిన 1109 క్యారెట్ల వజ్రాన్ని లండన్‌కు చెందని ఆభరణాల సంస్థ లారెన్స్‌ గ్రాఫ్‌ 5.3 కోట్ల డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 444 కోట్లకు) కొనుగోలు చేసింది. ఇప్పుడు దానికి రెట్టింపు బరువు ఉన్న ఈ వజ్రం.. ఎంత ధరకు అమ్ముడుపోతుందన్న ఆసక్తి నెలకొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular