Kumari Aunty
Kumari Aunty: కుమారి ఆంటీ(Kumari aunty) హైదరాబాదులోని కోహినూర్ హోటల్ పక్కన ఫుట్ పాత్ పైన చిన్నపాటి హోటల్ నడిపిస్తుంటుంది. వెజ్ – నాన్ వెజ్ భోజనాలు ఈమె దగ్గర లభిస్తాయి. తలకాయ కూర, బోటీ కూర, లివర్ కూర, చికెన్, మటన్, బగారా రైస్, వైట్ రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, పుదీనా కొత్తిమీర రైస్ ఈమె దగ్గర లభిస్తాయి. సోషల్ మీడియా పుణ్యామాని కుమారి ఆంటీ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈమె నిర్వహిస్తున్న హోటల్ వల్ల ట్రాఫిక్ జాం అవుతోందని.. పోలీసులు ఆమెను హోటల్ నిర్వహించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో కుమారి ఆంటీ హోటల్ కు జనం భారీగా రావడం మొదలుపెట్టారు. దీనికి తోడు యూట్యూబర్లు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడటంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ ఏర్పడింది. పైగా ఆ ప్రాంతం ఐటీ ఉద్యోగులు ఉండేది కావడంతో ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఆమెను హోటల్ నిర్వహించవద్దని సూచించడంతో.. మీడియా ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే కల్పించుకొని.. ఆమె హోటల్ నిర్వహించడానికి ఇబ్బందులు కలగ చేయవద్దని పోలీసులకు సూచించారు. దీంతో అప్పటినుంచి ఆమె వ్యాపారం సజావుగా సాగుతోంది. పైగా బిజినెస్ కూడా పెరిగింది. ఈ లోగానే సోషల్ మీడియా ఆమెను మరింత ఫోకస్ చేయడంతో.. ఇంకా ఫేమస్ అయింది.
దేవుడి గదిలో..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హోటల్ నిర్వహించవద్దని హెచ్చరించడం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కల్పించుకుని ఆమెకు ఇబ్బందులు లేకుండా చూడటంతో.. కుమారి ఆంటీ దృష్టిలో రేవంత్ రెడ్డి దేవుడైపోయారు. ఇంకేముంది తనకు భృతి కల్పించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా కుమారి ఆంటీ దేవుడి గదిలో ఆయన ఫోటో పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టింది.. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. కుమారి ఆంటీ రేవంత్ రెడ్డి ఫోటోలు దేవుడి గదిలో పెట్టుకొని పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల మనిషని.. ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టరని.. దానికి కుమారి ఆంటీ ఉదంతమే సజీవ సాక్షమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి నాయకులు కళ్ళు తెరవాలని సూచిస్తున్నారు. దీనిపై కూడా వ్యతిరేకంగా మాట్లాడితే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. కుమారి ఆంటీ పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజిస్తున్న కుమారి ఆంటీ
రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీ pic.twitter.com/5JGjanTUch
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2025